3643* వ రోజు . ....           05-Nov-2025

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

5.11.25 (బుధవారం) నాటి శ్రమవిన్యాసాలు! @3643

               అవి వేలరోజుల వలెనే ఈ వేకువ కూడ 4.13 కి మొదలై, 6.14 దాక కొనసాగుతునే ఉన్నవి; పని విరమణ సూచకంగా 3 వ మారు విజిల్ మ్రోగి, ఇద్దర్ని బ్రతిమాలితే మాత్రమే ఆగినవి; లెక్కప్రకారమైతే - చిన్నాచితకా, ముసలీముతకా 46 మంది తాలూకూ పని విన్యాసాలు ఇటు రిజిస్ట్రార్ కార్యాలయం మొదలు అటు మునసబు - సజ్జా వీధుల పర్యంతం వ్యాపించినవి;

               ఎవరి అలవాటు, అభిరుచులను బట్టి గ్రామ స్వచ్ఛ సౌందర్యాలకోసమై 60 పని గంటలకు మించి,

1) కొందరు మూల్పూరి ఉద్యానంలోను,

2) కొందరు కర్మల భవనంలోను,

3) శ్రావ్యకృష్ణ వైద్యశాల గార్డెన్ లోనూ,

               కొందరు 1 వ వార్డు ముఖద్వారం వైపూ, ఇంకొందరు సజ్జావారి వీధి వైపూ, కత్తివీరులు ఏడెనమండుగురు మునసబు వీధి కాలుష్యాల మీదా....

               గంటన్నర పైగా సాగించిన సమరం సందడిగా, సమన్వయంగా, గ్రామస్తుల ఆహ్లాదార్ధంగా, ప్రతిఫలాపేక్షారహితంగా, గ్రహణశక్తి కలవారికి స్ఫూర్తిమంతంగా, ఫలప్రదంగా జరిగింది!

               అక్కరలేని కొమ్మల్ని ఖండించే ఒక ఆకుల వారి యంత్ర ధ్వనులూ, కాస్త ఒరిగి నడుస్తూ పని తడాఖా చూపిస్తున్న కొండపల్లి వాని పట్టుదలా, మూత్రం చెమ్మల చోట కర్మ యోగుల్లా శుభ్రపరుస్తున్న అంబటి- కోడూరుల స్థితప్రజ్ఞలూ, ఏడెనమండుగురు యువ కార్యకర్తల ఉరుకులు - పరుగులూ, నలుగురైదుగురు పెద్దల వయసుకు తగని సేవలూ, స్త్రీ కార్యకర్తల సందర్భోచిత పనులూ....... ఇలా నేను కన్నవి-విన్నవి సంతృప్తికరంగా వివరించాలనుకొంటే స్థలాభావం అడ్డొస్తున్నది!

               2 గంటల మురికి పనుల తర్వాత ఈ కార్యకర్తల మాటల్లో తెలిసింది వాళ్ల అలసట కాదు - రేపటి ఊరి మెరుగుదలపట్ల ఆశా భావమే! నేటి తమ పనిపట్ల సంతృప్తీ, రేపటి పని ప్రణాళికా వినిపించాయి గాని – “ఊరి జనులంతా పట్టించుకోని వీధి శుభ్రతలు మనకే కావలసొచ్చాయా” అనే నిరాశా నిస్పృహలు కావు!

               సమీక్షా సమావేశమూ అంతే - ఒక గురవయ్య మాస్టరేమో సర్దార్ పటేల్ గారి సూక్తులూ, చల్లపల్లి స్వచ్చోద్యమ నినాదాలూ ప్రకటిస్తాడు, ఒక స్వచ్చ వైద్యుడేమో మనం ఇంకా గ్రామం కోసం ఎప్పుడే ప్రణాళికలు అమలు చేయాలో, పని వేళ కార్యకర్తలేజాగ్రత్తలు వహించాలో - రేపు కూడ ఇదే బందరు వీధిలో ఏమేం చేయాలో వివరిస్తాడు!

               ఎలాగోలా సందు చూసుకుని నేను అందరికీ చాక్లెట్లు పంచుతాను,

               రేపటి మన పనిపాటుల కోసం అందరం బందరు రోడ్డులోని మునసబు వీధి మొదట్లో కలుద్దాం మరి!

ఎంత దృష్టము చెప్ప జాలను జీవితములో!

ప్రతి దినం శ్రమపాటవమ్మును పరవశంతో చూచుండుట –

శ్రమ త్యాగ ధనుల్ని వేకువ సమయమందున కలసి మెలసీ 

శ్రమోద్యమమును ఉగ్గడించుట – శ్రమోత్సాహము గూర్చి వ్రాయుట -

సహచరించుట ఎంత దృష్టము చెప్ప జాలను జీవితములో!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    05.11.2025