3651* వ రోజు . ....           13-Nov-2025

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

ఊరు నడిబొడ్డున 55 గురి వీధి సేవ - @3651*

               సేవాకాలం నికరంగా 4.18 - 6.28,  కొసరుగా పంచాయితీ వారి మరో 15 నిముషాలు. 45 గురు స్వచ్ఛ కార్యకర్తలూ, చివరలో 10 మంది పంచాయతి శ్రామికులు ఏమి సాధించారు అంటే –

               అది పోలీసు ఠాణా వీధి - నాలుగో ఐదో బ్యాంకులు, ఆస్పత్రులు, ఆఫీసులు, టిఫిన్ సెంటర్లు, అంగళ్ళు.... బహురద్దీ ప్రాంతం, అక్కడ తయారైన కంపుకొడుతున్న మినీ డంపు. సదరు స్థలం యజమాని గాని, వీధి ప్రజలు గాని దాన్నెలా భరిస్తున్నారో తెలియదు.

               గత 11 ఏళ్లలో ఊరి కాలుష్యాలపై జరిగిన చారిత్రాత్మక యుద్దాలలో నేటి 70 పని గంటల సమరం ఒకటని చెప్పవచ్చు! పెద్ద ట్రాక్టరులోనూ, పంచాయతి ట్రాక్టరులోనూ నిండిన వ్యర్ధాలే – బస్తాల కొద్దీ సారా - నీటి సీసాలే - సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లే అందుకు నిదర్శనం!

               ఒక్క నిముషంలో వెళ్లగలిగిన స్వచ్ఛ సుందర పబ్లిక్ టాయిలెట్లుండగా అక్కడంతమంది మూత్ర విసర్జన చేయడమేమిటో అర్థం కాదు. ఆ వీధి ప్రజల్లో ఒక్కరంటే ఒక్కరైనా నేటి వీధి పారిశుద్ధ్యంలో ఎందుకు పాల్గొనరో తెలియదు. తమ బజార్లో అంత శ్రమదాన సందడి జరుగుతుంటే ఇళ్ల – దుకాణాల వారు ఎందుకు వచ్చి చూడరో చెప్పరు!

               అసలు బందరు వీధి శుభ్రతలో మునిగి తేలే కార్యకర్తలు ఈ డంపింగు దుర్వాసన సోకి, పోలీసు వీధి వైపు మళ్లారు. వీధి చివర దాక పారిశుద్ధ్యం పూర్తి కాలేదు గాని, బాగుపడినంత మేర ఎంత విశాలంగా, శుభ్రంగా కనిపిస్తున్నదో చూడండి. బ్యాంకుల వద్ద డ్రైన్ల గట్ల గడ్డీ, పిచ్చి చెట్లూ, ఇతర వ్యర్థాలూ ఇప్పుడక్కడ కనిపిస్తున్నాయా?

               చాల మంది గ్రామస్తులు స్వచ్ఛ కార్యకర్తల సేవలను కీర్తిస్తుంటారు; - DRK డాక్టరును దేవుడనీ, మనకాలపు, మనప్రాంతపు గాంధీ అని కూడ అంటారు - మరి ఆచరణలో అనుసరించే దెందరు?

               ఆలస్యంగా జరిగిన సమీక్షలో గంధం బృందావనుడు జాడించి చెప్పిన శ్రమదాన దీక్షా నినాదాలకు ముందు సీనియర్లిద్దరు పంచిన బిస్కట్లూ, తరువాత నేటి కఠిన శ్రమను వర్ణించడానికి మాటలు దొరకని స్వచ్ఛ వైద్యుడూ,

               రేపటి శ్రమదానం ATM కేంద్రాల వద్దననే నిర్ణయమూ !

               చల్లపల్లిలో మినహా! – 7

డెబ్బది - ఎనుబది దాటిన వృద్ధ కార్యకర్త మొదలు

ఉద్యోగ నిరుద్యోగులు యువకులు పిల్లలు మహిళల

సమన్యయంతో జరిగే స్వచ్ఛ శుభ్ర - శ్రమ లీలల

సాక్షాత్కారం జరుగదు చల్లపల్లిలో మినహా!

-నల్లూరి రామారావు

  ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  13.11.2025