3653* వ రోజు . ....           15-Nov-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

15.11.2025 శనివారం - 3653* వ రోజు నాటి శ్రమ జీవన విశేషాలు!

               ATM సెంటరు వద్ద వేకువ జాము 4.15 ని. లకు కార్యకర్తలు అంతా చేరి పనికి సిద్ధమయ్యేసరికి ఆ ప్రాంగణమంతా మట్టితో నిండి ఉంది. చల్లపల్లిలో ఏదైనా ఓపెన్ మీటింగ్ జరుపుకోవాలంటే, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పబ్లిక్ కూర్చోటానికి వీలుగా ఆ సెంటర్ లో ప్రాంగణమంతా పేవర్ టైల్స్ తో సౌకర్యంగా ఉండేది. స్వచ్చ కార్యకర్తలు అంత వీలుగా ఆ ప్రదేశాన్ని ఒకప్పుడు తీర్చిదిద్దారు.

               కానీ ఈ రోజు అనేకమంది వ్యాపారులు స్వప్రయోజనం వలన అధికారుల అలసత్వం తోడై ఈ రోజు ఆ ప్రదేశం ఆక్రమణలతో కుచించుకుపోయి కళావిహీనంగా మారింది. మురుగు డ్రైను పైకి పొంగి పొర్లి అక్కడ మట్టితో నిండిపోయింది. కానీ కార్యకర్తలు మాత్రం చీపుళ్లు, పారలు చేతపట్టి ఆ ప్రాంతాన్ని డిప్పల కొద్దీ మట్టి తీసి అందంగా చేయగలిగారు.

               రోడ్డు పొడవునా పెట్రోలు బంకు వరకూ రెండు ప్రక్కలా పేరుకుపోయిన ఇసుకను ఊడ్చి వెడల్పైన తారు రోడ్డు మీద చీపురుతో ఊడ్చుతుంటే దుమ్ము కార్యకర్తల ముక్కుల్లోకి వెళ్లి చాలా ఇబ్బంది పడ్డారు. శుభ్రం చేయగా వచ్చిన మట్టి గుట్టలను ట్రాక్టర్ లో లోడ్ చేసి చల్లపల్లి - నడకుదురు రహదారిలో వేసి గుంతలు పూడ్చారు.

               6.15 ని. ల వరకూ జరిగిన స్వచ్చంద సేవలో 47 మంది పాల్గొని చెమటోడ్చి రహదారిని అందంగా తయారు చేసి, విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చారు.  

               తదుపరి సమీక్షా సమావేశంలో  పాల్గొని స్వచ్చ చల్లపల్లి ఉద్యమ ఆత్మీయ శ్రేయోభిలాషి, NRI ‘నాదెళ్ళ సురేష్’ గారు పలికిన “జై సంపూర్ణ స్వచ్చ సుందర చల్లపల్లి” నినాదానికి ముక్త కంఠంతో జై కొట్టారు.

               హిందూ శ్మశానవాటిక అభివృద్ధి నిమిత్తం వేముల రాధాకృష్ణ ప్రసాద్ గారు 10,000/- రూపాయలు,

               స్వచ్చ చల్లపల్లి అభివృద్ధికి పల్నాటి అన్నపూర్ణ గారి కోడలి పుట్టిన రోజు సందర్భంగా 3,000/- రూపాయలు డాక్టరు గారికి అందజేశారు.

               కార్యక్రమానంతరం అందరూ “మొక్కల రమణ” గారి నూతన గృహ ప్రవేశ ఆహ్వానమందుకొని అక్కడికి వెళ్లి అల్పాహారాన్ని స్వీకరించారు.      

               రేపటి కార్యక్రమం కోసం ATM సెంటర్ వద్ద కలుసుకుందాం.

- నందేటి శ్రీనివాస్

   ప్రజా కళాకారుడు

   15.11.2025.   

               చల్లపల్లిలో మినహా! – 9

వీళ్లకదొక పిచ్చనుకో – వెర్రనుకో – జబ్బనుకో

ఎవ్వరేమి అనుకొన్నా గత పన్నెండేళ్ల నుండి

రెక్కల కష్టంతో తమ ఊరు చక్కబెట్టు కృషిని

చల్లపల్లిలో మినహా మీరెక్కడ చూడలేరు!

-నల్లూరి రామారావు

  ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  15.11.2025