3654* వ రోజు . ....           16-Nov-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

3654* వ నాటి శ్రమానందం.

               మామూలు రోజుల్లోనే వస్తుంటే ఆదివారం (16-11-25) 41 మంది కార్యకర్తలు బందరు వీధి సేవలో పాల్గొనకుంటారా? ముందు నాటి  నిర్ణీత స్థలం- బందరు రోడ్డుకు చెందిన ATM కేంద్రం వద్ద 4.20 కే చేరుకొన్నవారు 17 మంది. సంత వీధి మొదలుకొని అవనిగడ్డ రోడ్డులోని బంకు దాక సుమారు 2 గంటలు శ్రమ సందడే సందడి! ఇంత వేకువనే చలిలో పది మంది మహిళల పారిశుద్ధ్య పనులేమంటారా? ఇది స్వచ్ఛ సుందర చల్లపల్లి గదా.. వాళ్ల పాత్ర ఉంటుంది మరి!

               ఇవ్వాళేదో మూడు నాలుగొందల గజాల వీధి కాలుష్యాల అంతు చూశారు సరే- ఈ కార్యకర్తలొక క్రొత్త సంప్రదాయం  మొదలెట్టారు - ఎందుకైనా మంచిదని నిన్నటి ప్రాంతాన్ని కూడ ఊడ్చి మరీ నేటి క్రొత్త చోటుల్ని శుభ్రపరచడమన్నమాట!

ఈ వేకువ పనుల్లో నన్ను బాగా ఆకర్షించిన 2 విషయాలివి:

               డిగ్రీ చదువుతున్న ఒక క్రొత్త యువతి యశస్విని ప్రాత వాళ్ళతో సమానంగా కోట సెంటరు వద్ద చురుకుగా పనిచేయడమూ,

               పబ్లిక్ టాయిలెట్ల – సచివాలయ - గణేశ్ ముద్రణాలయ ప్రాంతంలో 20 మంది పన్లూ! ఎంత గడ్డిని – పిచ్చి కంపని -  ప్లాస్టిక్ వ్యర్థాల్ని చెక్కి, నరికి, ఏరి, దూరంగా ట్రక్కులో నింపారో ఎవరైనా చూసి తీరాలి!

               ఇక తెల్లారాక – మనుష్య సంచారం పెరిగాక – ప్రాత పోస్టాఫీసు వద్ద సందడిగా తొందరగా – జరిగిన దుమ్ము - ఇసుకల లోడింగు గానీ -  పని విరమణ ఈల మ్రోత గానీ ఎప్పుడూ ప్రత్యేకాకర్షణే!

               అసలు 2 గంటలు కాలుష్యాలతో కుస్తీ  పట్టిన వాళ్ళు తుది సమీక్షా సభలో ఎందుకంత సంతోషంగా కనిపిస్తారో- రేపటి ఊరి మెరుగుదల కోసం ఆతృత పడతారో ముందుగా గ్రహించండి!

               నేటి మరొక విశేషం కలెక్టరాఫీసు ఉద్యోగి తూము వెంకటేశ్వరరావు-ఇందిరల క్రొత్త సైకిలు రైడింగు ప్రదర్శన!  జిల్లా అధికారి బాలాజీ గారి ఆదర్శాన్ని పాటిస్తూ తూము వారు ఇక్కడి నుండి 26 కి. మీ. దూరానికి సైకిలు మీద వెళ్తారట!

               రేపటి గ్రామ బాధ్యతల కోసం కార్యకర్తలు కోట సెంటరు (అవనిగడ్డ రోడ్డు) లో కలవాలని నిర్ణయించారు. కస్తూరి ప్రసాదు గంభీర నినాదాలు అక్కడ  ప్రజల చెవుల తుప్పు వదలించాయి!

               చల్లపల్లిలో మినహా! – 10

దేశ సరిహద్దులలో సైన్యం! చల్లపల్లిలో సైన్యం!

ఒక సైన్యం చొరబాట్లు నిరోధించే ప్రక్రియలో

మరొక సైన్యం గ్రామ స్వచ్చ - స్వస్తతలను సాధిస్తూ.....

చల్లపల్లిలో మినహా ఇది మీరిక చూడలేరు!

-నల్లూరి రామారావు

  ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  16.11.2025