పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
కార్తీక తుది సోమవారపు శ్రమ వైవిధ్యం - @3655*
ఈ ఏటి చివరి పవిత్ర సోమవారమని కాబోలు -
నిన్నటి స్వచ్ఛ కార్యకర్తల 41 సంఖ్య నేడు 27 గా కుదించుకుపోయింది.
సంఖ్యతో పెద్దగా పనేమున్నది గాని -
అవనిగడ్డ రోడ్డులోని బాదంపాల కేంద్రం వద్ద 4:16 కే చేరుకొన్న 11 మంది కార్యకర్తలు శంకర శాస్త్రుల వారి ఫొటోకు నిలిచి,
చకచకా చేతొడుగులు ధరించి, సాయుధులై, నిన్న శుభ్రపరచిన బందరు వీధి పెట్రోలు బంకు వద్ద పనులారంభించగా-
నిముష క్రమాన వస్తున్న కొందరు చీపుళ్లే ఆయుధాలుగా 3 రోడ్ల కూడలి వద్ద దుమ్మూ - ధూళీ, ఇతర కాలుష్యాల పైకి దండెత్తగా -
అరేడుగురు బరువు పనుల కార్యకర్తలు ఎలిమెంటరీ పాఠశాల వద్ద పడి ఉన్న చెట్ల కొమ్మల్ని నరికి, ట్రాక్టరులో నింపుకొని, కమ్యూనిస్టు వీధి వద్ద నిల్వ చేయగా -
వీళ్లే మళ్లీ కార్యకర్తలూడ్చిన మట్టి గుట్టల్ని ట్రాక్టర్ లో వేసుకొని, వీధి పల్లాలను పూడ్చు చుండగా -
మిగిలిన వారు పొట్టి శ్రీరాములు వీధి దాక మూలమూలలా శుభ్రపరుస్తూ దుమ్ము మేఘం నుండి అస్పష్టంగా కనిపిస్తే -
MRF షోరూమ్ వద్ద చెట్ల కొమ్మల్ని ట్రిమ్ చేశాక - చాల వరకు వ్యర్ధాల లోడింగు ఐపోతున్నదనుకొనే సమయంలో పెట్రోలు బంకు ఎదుటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆరేడుగురు శుభ్రపరచడమూ, మళ్లీ వాటి లోడింగులతో ఎట్టకేలకు 6.15 కు పని విరమించారు.
2 గంటల వీధి బాగుదల ప్రయత్నం తరువాత కూడా ఐదారుగురు కార్యకర్తలకు నేటి 250 గజాల రోడ్డు సుందరీకరణం సంతృప్తి కలగక -
ఆస్పత్రి కాంపౌండరు ‘హరికుమార్’ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో మొదలైన సమీక్షా సభలో రేపు వేకువ ఇదే అవనిగడ్డ రోడ్డులోని కరీముల్లా డ్రస్ షాపు వద్ద ఆగినపుడు 3 రోడ్ల సెంటరు నుండి పని మొదలు పెట్టాలనీ, RTC బస్ స్టేషను దాక శుభ్రపరచాలనీ తీర్మానించారు.
- ఇవీ 27 గురు కార్యకర్తల, 45 పని గంటల నేటి శ్రమదాన సంగతులు!
చల్లపల్లిలో మినహా! - 11
ముప్పై - నలభై ఊళ్లలొ గొప్ప గొప్ప కార్యకర్త
లుత్సాహం తొందరించి - ఉద్యమాలు మొదలు పెట్టి
‘కాలం కలిసి రాలే’దని క్రమక్రమంగా విరమించిరి!
చల్లపల్లిలో మినహా ఈ విజయం మరెక్కడుంది?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
17.11.2025