3656* వ రోజు....           18-Nov-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

మంచి చలి వేకువ వీధి సేవలు - @3656*

               సేవలు 27 మందివి; వీధి: నాగాయలంక రోడ్డులో ప్రధాన కూల్ డ్రింకుల నుండి RTC బస్ ప్రాంగణం దాక; కార్యకర్తల ఆయుధాలు : కత్తులు, దంతెలు, చీపుళ్లు, డిప్పలు; సమయం: 4.17 నుండి 6.10 దాక!

               పనుల సాక్ష్యాలూ, మరిన్ని వివరాల కోసం “జై స్వచ్చ చల్లపల్లి సైన్యం” వాట్సప్ తెరవండి; పని దృశ్యాలూ, పనుల పిదప 6:30 దాటాక ఈ 200 గజాల వీధి శుభ్రతల్ని వెళ్లి గమనించండి; కార్యకర్తల నేటి 45 పని గంటల శ్రమత్యాగం ఏకాస్తనచ్చినా, నిర్మొహమాటంగా రేపే వీధి సేవలకు రండి!

               ఇదేదో ఒకనాటి – ఒక ఏటి శ్రమదానం కాదనీ – మనందరి ఆహ్లాదం కోసం 11–12 ఏళ్ల నుండి ఎడతెగక జరుగుతున్న గ్రామ సామాజిక బాధ్యతా యజ్ఞమని మరువకండి. ఉబుసుపోకగా  - ఆషామాషీగా నిర్వహించే ఉత్తుత్తి శ్రమదానమని నమ్మకండి!

               గ్రామ సర్పంచితో సహా మహిళలూ, వయోధికులూ, వివిధ వర్గాల కార్యకర్తలూ గ్రామ స్వచ్ఛ సౌందర్య లక్ష్యంతో చేస్తున్న శ్రమదాన ప్రస్థానాన్ని అవగాహన చేసుకొండి - ఆశీర్వదించండి!

               నిజానికి నేటి స్వచ్చ - శుభ్ర - సుందరీకృత వీధి ప్రాంతం చాల వరకు నిన్న బాగుచేసిందే! కార్యకర్తల రెక్కల కష్టంతో పునీతమయిందే! ఐతే కొందరు వీధి సౌందర్య పర్ ఫెక్షనిస్టుల పట్టుదలతో మళ్లీ ఊడ్చి -

               నిన్న మిగిలిపోయిన వీధి మార్జిన్ల పిచ్చి మొక్కల్నీ, గడ్డినీ తొలగించి -

               ఐదారుగురు లోడింగు వారు 2 రకాల వ్యర్ధాల్ని ట్రక్కులకెక్కించి -

               దుమ్మూ - ఇసుక మిశ్రమాన్ని అవసరమైన చోట్లకు తరలించి –

               పల్లాలను పూడ్చి -

               చివరిగా శుభ్ర – సుందరీకృత వీధిని సంతృప్తిగా చూసుకొని –

               కాఫీలు సేవించి –

               సమీక్షా సమయంలో రేపటి పనుల్ని ప్రస్తావించుకొని –

               ఆస్పత్రి ఉద్యోగి గౌతముని స్వచ్చ నినాదాలకు బదులిచ్చి – నేటి శ్రమదానానికి స్వస్తి పలికారు!

               రేపటి మన కలయిక RTC బస్టాండు వద్ద.

               చల్లపల్లిలో మినహా! – 12

ఉత్సాహంలో నిలకడ, ఆవేశంలో అణకువ,

ఆలోచన నాచరణగ అనువదించు ఓర్పు - నేర్పు,

పడి లేచే మంచి గుణం, పట్టుదలగ శ్రమించడం..

చల్లపల్లిలో మినహా ఇవన్ని మీరు చూడలేరు!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    18.11.2025