3657* వ రోజు ....           19-Nov-2025

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

చలికి వెరవని 3657* వ వేకువ వీధిసేవలు!

               రోజురోజుకూ పెరుగుతున్న – మంచుతో కలిసి వీస్తున్న - చలిని ధిక్కరించిన 28 మంది స్వచ్ఛ కార్యకర్తల గల్లీ బాధ్యతలిట్లున్నవి :

               పై సంఖ్యలో డజను మంది రంగ ప్రవేశం 4.20 కే. మరొక పావుగంటలో ఆ సంఖ్య వృద్ధి చెంది, 3-4 వందల గజాల వీధి పారిశుద్ధ్యం 6.10 దాక జరిగింది.

               చదివే ఎవరికైనా నా వ్రాతలు కొంచెం అతిగా, స్తుతిగా అనిపిస్తాయేమో గాని స్వయంగా పాల్గొని, ప్రతి కార్యకర్త కృషినీ, అంకిత భావాన్నీ పరిశీలించే నాకు అలా కాదు; ఎక్కడైనా పిసరంత అతి శయోక్తి దొర్లినా - వాస్తవాల ఆధారంగానే నేను వ్రాస్తున్న ఈ సమాచారం!

               ఊళ్లోని అత్యంత రద్దీ ప్రాంతం వెనుక, కార్యకర్తలు వీధి శుభ్రతతోబాటు తమ భద్రతనూ గుర్తుంచుకొని పనులు చేయవలసివస్తున్నది - ముఖ్యంగా 3 రోడ్లు కోట మలుపు వద్ద.

               సోమ, మంగళ వారాల నాగాయలంక రోడ్డు శుభ్రతను చూసి సంతోషించాం గాని, ఈ వేకువ కూడ మళ్లీ వైశ్యాబజారు నుండి మరొక మారు ఊడ్చి మరిన్ని మెరుగులు దిద్దాక గాని సదరు వీధి సౌందర్యం పరిపూర్ణం కాలేదు . ఆలయం ముందు నిలిచి, ఇటు బస్టాండు ఇన్ గేటుదాకా, అటు బందరు వీధి దాకా చూస్తుంటే కార్యకర్తల శ్రమ ఎలాంటిదో - అన్ని గ్రామాల వీధులన్నిటికీ ఈ వీధి భాగం ఎంత ఆదర్శమో తెలిసొస్తున్నది!

గంటన్నరకు పైగా సాగిన శ్రమదానంలో :

- కార్యకర్తలు వీధిని ఊడ్చారు,

- మూల మూలల్లోని వ్యర్థాలను బైటకు లాగారు,

- ముగ్గుర్నలుగురు RTC ఔట్ గేటు లోకీ వెళ్లి కృషి చేశారు,

- దుమ్మూ - ధూళీ, ప్లాస్టిక్ వ్యర్ధాలను వేర్వేరుగా ట్రక్కుల్లో నింపారు,

- ఆ దుమ్ముతో వీధి మార్జిన్ల పల్లాలను పూడ్చారు!

6.25 కు సమీక్షా సమావేశంలో :

               శివబాబు గారి స్వచ్చోద్యమ నినాదాలూ,

               డి.ఆర్.కె.గారి బాపట్లలోని మానవత సంస్థ కార్యకలాపాలూ,

               దేవాలయాల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ల గూర్చి బ్రహ్మశ్రీ చాగంటి వారు తమ ప్రవచనాల్లో చెప్పగలరనే వాగ్దానమూ, నిన్నటి లక్ష్మీ కాంతం గారి చల్లపల్లి పర్యటనా, యూరోపియన్ యూనియన్ సమావేశాల్లో ప్రస్తావించనున్న స్వచ్ఛ చల్లపల్లి సేవా సంగతీ.. చర్చకు వచ్చాయి!

               కార్యకర్త శ్రమజనితం!

చూచుకొలది చూడాలని, చూపు త్రిప్పుకోనీయని

ఒక  పొందిక - ఒక శుభ్రత - ఒక పుష్పం - ఒక హరితం

ఔరా! ఈ రెండొందల పదహారవ రహదారిదె

అసలు సిసలు అదృష్టం - కార్యకర్త శ్రమజనితం!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    19.11.2025