పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
శుక్రవారం నాటి స్వచ్చంద శ్రమ రీతులు - @3659*
శ్రమకారులు 29 మంది - అందులో మితిమీరిన10 మంది ఉత్సాహం 4:17 కే! పని ముగింపు 6.19. RTC గార్డెన్ ను అక్టోబరు తుఫాను ఛిన్నాభిన్నం చేస్తే, మేమున్నామని వంచిన నడుములెత్తక చివరి దాక కష్టించినది 6 గురు! మరరంపంతో - వాలిపోయిన ఎత్తైన చెట్ల కొమ్మల్ని కోస్తున్న ఆకుల కార్యకర్త గ్రామ సామాజిక స్ఫూర్తిని అంచనా కట్టాలంటే నావల్లకాదు గాని - డబ్బు రూపేణా ఆ పని విలువ 1000/- కి పైమాటే!
కుర్ర కార్యకర్తలు సరే - వయస్సు మళ్లిన, రెండు మూడేసి సర్జరీలు చేయించుకొన్న, మోకాళ్లూ - నడుములూ చెప్పిన మాట వినని కార్యకర్తలు - అదేం వింతోగాని – పని చోటుకు రాగానే అంత సత్తువ ఎలా వస్తుందో మరి వారిస్తున్నా ఆగరు!
చెత్త బండెక్కి, నానా రకాల కాలుష్యాలను సర్దుతున్న - సాపేక్షకంగా క్రొత్త కార్యకర్త హేమంత్ చురుకుదనాన్నే గమనించండి – చెత్త త్రొక్కుడులో గురువైన అంజయ్యనే మరపిస్తున్నాడు!
RTC బాహ్యద్వారం వద్ద చిన్నపూదోట గానీ, దానెదురు పెద్ద గార్డెన్ గానీ తుఫాను భీభత్సం నుండి ఈ మాత్రం కోలుకోవడానికి రోజూ 40 కి పైగా పని గంటల శ్రమే గదూ కారణం?
“ఐతే ఇన్ని వేల ప్రజల గ్రామానికి చెందిన - వందలాది ప్రయాణికులు నిత్యమూ వాడుకొనే బస్టాండు మీద శ్రద్ధ చూపేది మాత్రం ఈ 30-40 మంది స్వచ్ఛ కార్యకర్తలేనా? మొహమాటానికైనా - కొందరైనా వచ్చి సహకరించరా? అప్పనంగా సమకూరుతున్న స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యాల ననుభవిస్తే చాలా?” అనే ప్రశ్నలు నాబోటి నిత్య శంకితులకు కల్గుతూనే ఉంటాయి!
పనుల నుండి సేద దీరుతూ - మంచి కాఫీలు త్రాగుతూ స్వచ్ఛ కబుర్లాడుతూ 6.35 కు జరిగిన నినాద సభలో:
- రక్తదాన వీరుడు కస్తూరి విజయ్ స్వచ్చోద్యమాశయాన్ని ముమ్మార్లు నినదించగా,
- అంతకు ముందు లంకే సుభాషిణగారు సున్నుండలు పంచగా,
- నేటి శ్రమ వైభవాన్ని DRK డాక్టరు గారు కీర్తించగా,
- రేపటి శుభ్రసుందరీకరణ కూడ RTC వద్దనే అను నిర్ణయంతో నేటి కార్యక్రమ పరిసమాప్తి!
గుండెకు స్వాంతన లభించు
ఈ బాటను (NH 216) చూసిననూ - ఇటుగా పయనించిననూ
పచ్చనైన పొలం మధ్య స్వచ్ఛమైన రహదారిని
గుర్తుచేసుకొన్న చాలు గుండెకు స్వాంతన లభించు
ఎవ్వరి శ్రమ రహదారిని ఇలా తీర్చిదిద్దెనొ మరి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
21.11.2025