3661* వ రోజు....           23-Nov-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ప్రభుత్వాసుపత్రి వద్ద ఆదివారపు గ్రామ సేవలు @3661*

               RTC ప్రాంగణపు పునస్సుందరీకరణను అర్థాంతరంగా  వదిలి, బెజవాడ రోడ్డు వద్ద విజయా కాన్వెంటు బజారు వీధులకు 4.15 కే కార్యకర్తలు వెడలిన కారణంబేమనగా –

               సదరు కాన్వెంటు లో 23 ఏళ్లుగా జరుగుతున్న GBR ఫౌండేషన్ వారి సముచిత వైద్య శిబిరంలో సేవలందిస్తుండగా, 30 మంది కస్తూర్బాయి ఆస్పత్రి వీధి శుభ్ర సౌందర్యాలకు హామీ ఇచ్చారు.

               రెండు వైపుల లోతైన డ్రైన్లలో పేరుకుపోయిన చిత్తు కాగితాలు, ప్రాత వస్తువులు, ఆకులు, పుల్లలు, పిచ్చి కంపలు, ప్లాస్టిక్ దుర్మార్గాలు, డ్రైన్ల గట్ల మీది గడ్డి, రోడ్డు మీది దుమ్ము ఇప్పుడా వీధిలో కనిపిస్తున్నాయేమో చూడండి.

               ఆ వ్యర్థాలన్నీ ట్రాక్టర్ లో నిండుగా కనిపిస్తున్న ఫోటో చూడండి, ఊరి వీధుల శుభ్రతా వ్యసన పరులైన ఆ 30 మంది 6.20 తరువాత కాలుష్య రాక్షసి మీద విజయ సూచకంగా ఆస్పత్రి ఆవరణలో నినాదాలు చేస్తున్నారు వినండి.

               ఈ యుద్ధ వీరుల్లో 78-87 ఏళ్ల ఉత్సాహవంతులూ, సబ్బినేని ఆస్పత్రి ఉద్యోగినితో సహా- సర్పంచమ్మతో సహా మహిళలూ, యాక్సిడెంటు వల్ల కాలు దెబ్బతిన్నా సరే, ఊత కర్ర సాయంతో పని చేసిన వ్యక్తీ ఉన్నారు చూడండి.

               ఈ వీధి గుండా రాకపోకలు సాగించే వారు పదకొండేళ్లుగా చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమం వల్ల వీధుల్లోని మార్పులు గ్రహించండి. గ్రామ ప్రయోజనకరమైన ఈ శ్రమదానంలో మీరెన్ని మార్లు పాల్గొన్నారో  - ఎందుకు పాల్గొనకూడదో ఆలోచించండి. మంచి సమయం ఇంకా మించిపోలేదని త్వరపడండి! ఊళ్లో అందరూ భోక్తలే ఐతే వడ్డించే వాళ్లూ ఉండాలని మరువకండి!

               కార్యకర్తలదేముందిలే – వాళ్లకు ఈ గ్రామం రాష్ట్రానికి తలమానికంగా – ఆరోగ్యంగా – ఆహ్లాదంగా మారాలనే వ్యసనం! గ్రామస్తుల్లో మరింత మంది స్వచ్చ కార్యకర్తలుగా మారితే గాని వాళ్ల లక్ష్యం త్వరగా నెరవేరదు – వాళ్ల పిచ్చి కుదరదు!

               ఇక – 23 ఏళ్ల వైద్య శిబిరం సంగతికొస్తే – అదీ 4.20 కే మొదలయింది. పక్షవాతం, మూర్చలు, రక్తపోటు, మధుమేహ పీడితుల కోసం డాక్టర్ గోపాళం శివన్నారాయణ అంతర్రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 46 శిబిరాల్లో ఇదొకటి! దీనికి సహకరిస్తున్న దాతలూ, కార్యకర్తలూ, వైద్యులూ, విద్యార్థులూ ధన్యులు! క్రమశిక్షణ తో వ్యవహరిస్తున్న అస్వస్తులు అదృష్టవంతులు!

               రేపటి శ్రమదానం కోసం స్వచ్చ కార్యకర్తలు చేరుకొనవలసింది RTC బస్ స్టాండులోనికే.

 

దేన్ని తుదకు వర్జించుట?

 

తొలుత గేలి చేసి నోళ్లే తెలిసి సేవలకు దిగుట,

అపనిందలు వేసి నోళ్లె గ్రామసేవలకు పూనుట,

సేవా భాగ్యము నందే సంతృప్తిని వెదకుకొనుట,

ఏది ముందు వర్ణించుట? దేన్ని తుదకు వర్జించుట?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    23.11.2025