పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
సోమవారం నాటి (24-11-25) శ్రమ సౌందర్యం! @3662*
‘సౌందర్యం’ ఎందుకంటే - సదరు శ్రమ కానే కాదు వైయక్తికం! అది సామూహికం! ఆ శ్రమ ఫలితం దక్కేది కష్టిస్తున్న 25 మందికి కాదు - అది సమాజపరమూ, ఈ RTC బస్ స్టాండు గుండా ప్రయాణించే వాళ్ల పరం!
అసలీ ఆవరణ స్వచ్ఛ శుభ్రతలు ఒక దశాబ్దం నుండీ స్వచ్ఛ కార్యకర్తలచే పదే పదే పర్యవేక్షితం! ఎండలు మండినా - తుఫానులు విరుచుకుపడినా ఈ పూల తోటలూ, పచ్చదనాలూ కార్యకర్తల జాగ్రత్తలతో సురక్షితం!
అందుకోసమే 4.14 కల్లా 11 మందీ, తదుపరి మరో 14 గురూ చలిని లెక్కచేయక అక్కడికి చేరడం, 6.12 దాక –
- కొందరు రోడ్డంతా ఊడ్చీ, ప్రవేశద్వారం వద్ద గార్డెన్ లో తుఫానుకు ప్రక్కకు ఒరిగిన చెట్ల శాఖల్ని ఖండించీ,
- ఖండిత శాఖోపశాఖల్ని షెడ్డర్ లోకి సరిపడా కత్తిరించీ, మరో ఇద్దరు ముగ్గురు వాటిని గుట్టలుగా పేర్చీ,
- పన్లో పనిగా నేను అందిన కాడికి ప్లాస్టిక్ - గాజు - వస్తువుల్ని ఏరి, మళ్లీ - ఇవన్నీ వచ్చే - పోయే వాహనాలను తప్పుకొంటూనే సుమా - శ్రమించడం!
ఈ పనులు కాక 16 మంది ప్రాత కక్కూసు దొడ్ల చుట్టూ చెమ్మ ప్రాంతంలోనే గడ్డి చెక్కి, పిచ్చి చెట్లను పీకి, లేదా నరికి, వేప చెట్టు రాల్చిన ఆకుల్ని, పుల్లల్ని ఏరి, ఊడ్చి, ఆ ప్రోగుల్ని డిప్పల కెత్తి, అందంగా రూపొందించిన విషయం అసాధారణం! ప్రయాణికులు తమాషా చూశారే గాని, కార్యకర్తలకు సహకరించలేదన్నది నిజం!
(ఈ 16 గురూ పని చేసిన ఐదారు సెంట్ల స్థలంలోకి క్రొత్త వారు వెళ్లకపోవడమే మంచిది - అదొక మూత్ర పరివేష్టిత దుర్గంధభూయిష్టం!
కార్యకర్తల ఇలాంటి (కొందరి దృష్టిలో- ) నీచ నికృష్ట చర్యలను చూసే చాలమార్లు Dr.DRK గారు “ఈ కార్యకర్తలు కాక ఈ పనులింకెవరు చేస్తారండీ?” అనేది!
ఇలాంటి పనుల్ని నేను రోజూ చూస్తూనే ఉన్నాను - ఒక్కోమారు ఒళ్లు జలదరిస్తుంది!
ఒక DRK డాక్టరు నొప్పి మాత్రలు మ్రింగి, నడుము ప్రక్కకు వాల్చి, దంతె పట్టి, కొమ్మలు వంచుతుంటేనూ, 87 ఏళ్ల వృద్ధ వైద్యుడు పెద్ద కొమ్మల్ని లాగుతుంటేనూ చూశానీరోజు!
6.25 తర్వాత అందరం ‘ఆకుల దుర్గా ప్రసాదు’ ప్రవచిత నినాదాలకు బదులిచ్చాం;
‘రేపటి శ్రమదానం కూడ ఈ RTC బస్ ప్రాంగణమందే’ అని సంకల్పించుకొని ఇళ్లు చేరాం!
తమ బందరు వీధి భాగాన్ని నెలకు 3 వేల ఖర్చుతో శుభ్రంగా నిర్వహిస్తున్న విజయలక్ష్మి మెడికల్స్ వుడత్తు వెంకటేశ్వరరావు గారు ఈరోజు స్వచ్ఛ చల్లపల్లి ఖర్చులకు గాను 10 వేల రూపాయల చెక్కును ఇచ్చినందుకు ధన్యవాదములు.
ఎన్ని కవితలని వ్రాయుట?
ఊరు కాని ఊరు కొరకు దాతల చందాల గూర్చి -
వేళకాని వేళలోన శ్రమ వీరుల కృషిని గూర్చి -
ఎవరెవరో ఇచటి కొచ్చి చేసిన సేవలను మెచ్చి –
ఎన్ని కవితలని వ్రాయుట? ఎంతగా ప్రశంసించుట?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
24.11.2025