3664* వ రోజు ....           26-Nov-2025

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

3664* వ శ్రమ వైభావాన్ని చిత్తగించండి!

               26 వ నవంబరు - 2025 వ తేదీ అన్నమాట. 6.20 కే RTC బస్ స్టేషన్ వద్ద క్రమశిక్షణతో నిలిచిన డజను మందిని ముందుగా గమనించండి. మరికొద్ది నిముషాల్లో చేరుకొన్న కార్యకర్తలతో సహా మొత్తం 34 మంది వీధి బాధ్యతలు 6.15 దాకా ఎలా ముగిశాయో ఇప్పుడు చూద్దాం.

               సువిశాల RTC ప్రాంగణానికి 30-35 కార్యకర్తల సేవల 8 వ రోజు ఇది. నేటితో బస్టాండు లోపలి భాగమంతా కార్యకర్తల ఇష్టానుసారం తీర్చిదిద్దబడినట్లే!

               కార్యకర్తల సంఖ్య కాస్త పెరిగినందునా, ఉత్సాహం ఇనుమడించడం చేతా, వెలుపలి వీధి సైతం ఎంత శుభ్ర సుందరంగా మారిందో తప్పక పరిశీలించండి; అలాగే గంటన్నరపాటు కూలిన - కూల్చిన వృక్షాల్ని కోయడానికి మర రంపం మ్రోతనూ వినండి; ఏడెనిమిది మంది రెస్క్యూ టీమ్ ఆ కొమ్మల ముక్కల్ని ట్రాక్టర్ లో పేర్చడాన్ని చూడండి.

               ఎందరు మహిళా కార్యకర్తలు ఊడిస్తే - ఆ ప్రోగుల్ని కొందరు డిప్పలుతో మోస్తే బస్టాండు మధ్య ప్రవేశం దగ్గర పెద్ద వ్యర్ధాల గుట్ట తయారైందో చూసి చెప్పండి. ఆ గుట్ట బహుశా రేపు డంపింగ్ యార్డుకు చేరవచ్చు!

               బస్ స్టాండు ఎదుట - కోట గోడ వైపు 15 మంది ఊడ్చి, గడ్డి తరిగి, వ్యర్ధాలను తొలగించాక ఆ 50-60 గజాల వీధి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో అక్కడి గ్రామస్తులు తప్పక గ్రహించండి. RTC సంస్థ చుట్టూ బాటలో గాని, తోటల్లో గాని ఇప్పుడొక్క వ్యర్ధ పదార్థం గాని, పిచ్చి మొక్క గాని, గడ్డిపరక గాని మిగిలితే చెప్పండి.

               అసలీ 8 నాళ్ళ శ్రమదానంలో ప్రయాణికులు, షాపుల వారు, పరిసర గృహస్తులు ఎందరు పాల్గొన్నారో కూడ ఆలోచించండి. అక్కడే కూర్చొని, కబుర్ల కాలక్షేపం చేస్తున్న వారైనా ఏ కాస్తయిన సహకరించని కారణమేమో తేల్చండి!

               బస్ స్టాండు బైట 6.35 కు జరిగిన సమీక్షా సభలో శబరిమల యాత్ర ముగించిన కస్తూరి విజయ్ పలికిన నినాదాలతో ఆటోల వారూ, నిలబడి చూస్తున్న ఇతరులూ గొంతు కలిపితే తప్పా అని కూడ ఆలోచించండి! కేరళ రాష్ట్రంలోనూ, ఊటీలోనూ ఎక్కడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్కులు ఎందుకు కనపడవో తెలుసుకొనండి!

               రేపటి వేకువ శ్రమదానం పడమటి వీధి గుడి వద్ద నని గుర్తుంచుకోండి!

               ఓహోహో! బస్ ప్రాంగణమా!

!!ఓహోహో! బస్ ప్రాంగణమా!! ఒక స్వచ్ఛ శుభ్రతా వికాసమా!

శ్రమైక జీవన సౌందర్యానికి తాజా సజీవ సాక్ష్యమా!

వారం రోజుల శ్రమానందమా! వందల గంటల వినోదమా!

సామాజిక స్పృహ తారా స్థాయిలో జ్వలించు సుమధుర సన్నివేశమా!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    26.11.2025