పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
చూడముచ్చటైన వీధి పారిశుద్ధ్యం - @3665*
నవంబరు మాసాంతపు గురువారం (27-11-25) నాటి పడమటి వీధి శ్రమదానం 26 మందికే పరిమిత మైనా పని వాసిలో గాని, రాశిలోగాని రాజీపడలేదు.
నేటి పనిపాటులు 2 చోట్ల - 2 రకాలు -
1) RTC బస్ ప్రాంగణ అంతర్ - బహిర్ పారిశుద్ధ్యము,
2) అక్కడికి పడమరగా వీధి పారిశుద్ధ్యము.
మొదటి దేమో 8 రోజుల పబ్లిక్ స్థల శుభ్ర సౌందర్యాలకు మరిన్ని మెరుగులు దిద్దడం; ఇందులో పనిచేసిన 9 మందీ బాగా రాటు తేలిన కార్యకర్తలు - అవసరమైతే బరువైన దుంగలు ఎత్తగలరు, గునపాలతో త్రవ్వగలరు, పడమటి ప్రవేశద్వారం దగ్గర కంపుగొట్టే నీటి గుంటను శుద్ధి చేయగలరు, బండెడు ఎండు కొమ్మల్ని సైజులు నరికి, ట్రాక్టరులో నింపనూ గలరు - అందుకేనేమో వాళ్ళకి “రెస్క్యూటీమ్” అనే నిక్ నేమ్!
కోట గోడనానుకొన్న షాపుల ముందు డజను మంది సాధించిన వీధి సౌందర్యం మాత్రం తక్కువదా? ఇటుక రాళ్ల మధ్య గడ్డినీ, ఇరుక్కున్న సమస్త వ్యర్ధాల్నీ - ఆఖరుకు చిరు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ వస్తువుల్నీ బైటకు రప్పించడానికి ఎంత ఓర్పు కావాలి ? కాలు సరిగా నిలవని ఎగుడుదిగుడు చోట గడ్డి నరకడంలో - పిచ్చిమొక్కలు తొలగించడంలో ఎంత ఓర్పుండాలి?
ఇక వీళ్లు కాక 3 వ బ్యాచ్ కార్యకర్తలు చీపుళ్లకూ, దంతెలకూ పని చెప్పారు. కోట పడమర మూల దాక పేరుకొన్న అంటుకుపోయిన దుమ్మునూ ఇసుకనూ అలా గంటన్నరపాటు గూళ్ళు నొప్పెట్టేలా గీకి, ఊడ్చి సఫలీకృతులయ్యారు.
మరొక అంశమేమంటే - ఈ కార్యకర్తలు శుభ్రపరచిన నిన్నటి ప్రదేశాల్లో 24 గంటలు గడవకుండానే 2 డిప్పల ప్లాస్టిక్ - గాజు సీసాలూ, కప్పులూ పడుండడం! స్వచ్ఛ - సుందర చల్లపల్లి” లో పరిస్థితే ఇలా ఉంటే - సాధారణ గ్రామాల సంగతేమిటి?
నేటి నినాదాల్ని గట్టిగా విన్పించిన ట్రస్టు ఉద్యోగి BSNL నరసింహారావు.
రేపు వేకువ కూడ ఇదే కోట దక్షిణ ద్వారం వద్దనే కలుసుకోవాలనేది కార్యకర్తల నిర్ణయం!
విజ్ఞతకు అభినందనం!
శ్రమత్యాగం వెల్లివిరిసే చల్లపల్లికి స్వాగతం!
స్వచ్చ శుభ్రత విరాజిల్లే పల్లెలకు అభివందనం!
ఐకమత్యం పురుడుపోసే పల్లెటూళ్ళకు వందనం!
ఇరుగు పొరుగుల సు సుఖంకోరే విజ్ఞతకు అభినందనం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
27.11.2025