పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
ఆదివారం - నవంబరు మాసాంతపు శ్రమ వేడుక – 3668*
రెండుమూడేళ్ల క్రిందట మూడేసి గంటల చొప్పున ATM సెంటరులో జరిగిన ఆనందాది వారాలు గుర్తున్నవా? ఈ పేకువ 2 గంటలపాటు పడమటి బజారులో మళ్లీ అవి గుర్తుకొచ్చాయి - కార్యకర్తలు + స్థానికులు కలిసి మొత్తం 50+3 మంది పాల్గొన్న తుది సమీక్షా సభను చూస్తుంటే!
తరగని ఇలాంటి ఆనందాలకు మూలం 11 ఏళ్ల పైగా ప్రతి వేకువా 30-40-50 మంది కార్యకర్తల ప్రతిఫలమాసించని శ్రమే కదా! శీతలశీతాకాలం – అందులోను జోరుగా వీస్తున్న తుఫాను ముందటి ఝంఝామారుతం! చేస్తున్నది వీధి సందుల దుమ్ము-ధూళి-ఎంగిలి-మురికి పనులు.
ఇళ్ల-వాకిళ్లను ఎంత శ్రద్ధగా శుభ్రపరుచుకుంటారో-అంత పట్టుదలగా జరుగుతున్న
1) వీధి ఊడ్పులు
2) వానకు మట్టి కొట్టుకుపోయిన సందుల పల్లాల పూడికలు
3) ఎక్కడెక్కడి సింగిల్ యూజ్ ప్లాస్టిక్కుల సేకరణలు,
4) 2 వాహనాల్లో 2 రకాల వ్యర్ధాలు నింపడాలు....
ఎవరు పరిశీలించినా ఒక అధ్భుత సామాజిక శ్రమదానం! అందుకే ఆ ప్రాంతపు కొందరైనా స్పందించారు, సమీక్షా సభానందం పొందారు! వాసు దుకాణ-టీ స్టాల్ వారైతే కార్యకర్తలకు బిస్కట్లు, టీ రుచి చూపించారు.
ఇక రామా యాక్స్ టైలరు వెంకటేశ్వరరావు గారైతే స్వచ్యోద్యమాను గుణంగా పర్యావరణహిత గుడ్డసంచుల్ని పంచారు!
పోనీ - 2 గంటల బరువు - మురికి పనుల అనంతరమైనా బట్టలు – దుమ్ము కొట్టుకుపోతే పోయాయి గాని – ఏ కార్యకర్తయినా విసుగు చెందాడా - నిరసించారా అంటే - అదేం లేదు. ఆ 150 గజాల వీధి శుభ్రతను చూసుకొని మురిసిపోవడం తప్ప!
మరీ ముఖ్యంగా వీధి దక్షిణపు సందు గుంటల్ని సరిజేసిన ఐదుగురు రెస్క్యూటీమ్ ముఖాల్లో ఆనందం చూడండి!
అందుకే దీన్ని మనం “గ్రామాభ్యుదయ శ్రమానంద ఆదివారం” అని పిలుచుకొందాం!
రేపటి వీధి బాధ్యతల కోసం పడమటి వీధిలోనే కలుద్దాం!
గొప్ప గ్రామం – స్వర్గ ధామం – 3
మురుగు కాల్వలు నడుస్తుంటే, వీధి శుభ్రత మెరుస్తుంటే
పచ్చదనములు పెచ్చరిల్లీ, ప్రాణవాయువు పరిఢవిల్లీ,
వీధి వీధిన పూల బాలల పకపకలు విప్పారుతుంటే.....
అది కదా ఆదర్శ గ్రామం! అదౌతుందొక స్వర్గధామం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
30.11.2025