పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
తుఫాను వాతావరణానికి ఎదురొడ్డుతున్న శ్రమదానం - @3669*
అసలే ఇది డిసెంబరు మాసపు చలి; అగ్నికి ఆజ్యం లాగా తుఫాను తాలూకు గాలులూ, తుంపర చినుకులూ; ఎంచుకొన్న రహదారేమో తమ ఇళ్లకు 3-4 కిలోమీటర్ల దూరపు కాసానగర ప్రాంతం!
ఐనా సరే - అక్కడ 26 మంది శుభ్ర - సుందర సేవలు! కత్తుల, దంతెల, చీపుళ్ల పనుల్తో బాటు ఆ చీకటిలో-తుఫానుకు ఒరిగిన-చెట్ల కొమ్మల్నీ, అక్టోబరు తుఫానుకు విరిగిపడి, ఎండిన కొమ్మల్నీ ముక్కలు కోస్తున్న మరరంపపు కఠోర శబ్దంతో పెద్ద సందడే నెలకొన్నది!
“అసలింత పెద్ద ఊరి బాధ్యతల కోసం సిద్ధమైన, 150-200 మందిలో ఈ పూట హాజరైన26 మందీ వీధి దీపాలు వెలగని, వానకు చిత్తడిగా మారిన 150 గజాల నాగాయలంక రహదారిలో ఏం సాధించారు?”
అంటే - 4.19-6.12 మధ్య వాళ్ళ శక్తి కొద్దీ ప్రయత్నించారు. కార్యకర్తల్లో కొందరికి రహదారి అస్తవ్యస్తతను చూస్తే, అక్టోబరులో విరిగి చిందరవందరగా పడున్న కొమ్మల్నీ ఆకుల్నీ చూడగానే ఆవేశమొస్తుంది - వాళ్ళ శక్తి రెండింతలౌతుంది.
లేకపోతే నలుగురైదుగురు సోకాల్డ్ ముసలోళ్లూ, నడుం నొప్పులోళ్ళూ, ఇంత వేకువన - ఇంత దూరం వచ్చి ఇన్ని బరువు పనులు చేస్తారా? బరువైన మరరంపంతో ఒకాయన అంతెత్తు కొమ్మల్ని గంటల కొద్దీ కోసేయగలడా? మోకాళ్లూ, నడుమూ బాధిస్తున్నా ఒక రైతు ట్రాక్టరెక్కి సర్దే పనికి దిగుతాడా? ఆస్పత్రి వారూ, పల్నాటి వారూ ఇంతింత చెత్తలు ప్రాగేసే పనులు చేయగలరా?
150 గజాల రహదారి తెల్లారేప్పటికి శుభ్ర - సుందరంగా మారడానికి ఎంత పట్టుదల, ఎంత సంకల్పమూ కావాలి? రేపైనా కాసానగరం వారో - ఇతరులో వచ్చి, కార్యకర్తలకు సహకరించకపోతారా?
నేటి సమీక్షా సందర్భంలో ఒక ఫ్లెక్సీ వింతను గూర్చీ, పొలంలో పంట వ్యర్ధాల్ని తగలెట్టే కాలుష్యం గూర్చి ప్రస్తావన జరిగింది.
దేవుని ఉనికే పట్టని గౌతమ బుద్ధుడినే దేవుడుగా - దశావతారాల్లో ఒకరిగా స్థిరపరచిన దేశం ఇది! ఫ్లెక్సీల మీద పోరు సలిపే వారినే ఫ్లెక్సీ లోకెక్కించడం కూడ అలాంటిదే!
రేపటి వీధి కర్తవ్యాలు కూడ కాసానగర సరిహద్దులందని నిర్ణయమైనది!
గొప్ప గ్రామం – స్వర్గ ధామం – 4
వీధి ఆక్రమణలు తొలగితే - యాక్సిడెంటులు జరగకుంటే –
సివిల్ రూల్సును ప్రయాణికులు చిత్తశుద్ధితో అనుసరిస్తే –
ఫ్లెక్సీ భూతం సమసి పోతే - ప్రశాంత తత్త్వం బోధపడితే
అదేగద తెలివైన గ్రామం! అదౌతుందొక స్వర్గధామం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
01.12.2025