3670* వ రోజు ....           02-Dec-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ఎడనెడా తుఫాను చిరుజల్లుల్లోనే రహదారి శ్రమదానం - @3670*

               ఆ దారి నాగాయలంక దిశగా కాసానగర్ వద్ద; శ్రమ 25 మంది సామాజిక బాధ్యులది; వాళ్లకది మూడేసి కిలోమీటర్ల దూరానిది; ఆ బాట భాగమేమో విద్యుద్దీపాలు వెలగనిది; వాతావరణమేమో కడు శీతలమైనది; తొలుత అతిశీతల గాలులే గాని, క్రమంగా చిరుజల్లులుగా మారినది.

               మరి – ఆ చీకటి శీతల ప్రత్యూష పవనాలలో పాతికమంది శ్రమదానమేపాటిది? తక్కిన పాతిక వేల ప్రజానీకంలాగే – సొంత పనులు చూసుకోక - వెచ్చగా దుప్పట్లలో ఉండిపోక - ఈ 0.1% మందికి మాత్రమే పట్టినది ఖర్మా లేక అదృష్టమా ?......

               ప్రశ్నలెప్పుడూ తలెత్తుతూనే ఉంటాయి – గ్రామ సమాజం నుండి జవాబులే కరవౌతున్నవి! ఇవేవీ ఆలోచించని - పన్నెండేళ్లుగా తమదెంత విశిష్ట – అభ్యుదయదాయక సామాజికాంశమో పట్టించుకోని స్వచ్చ కార్యకర్తలు మాత్రం అలవోకగా తమ కర్తవ్యాల్ని 4:20 – 6:15 నడుమ పూర్తి చేసుకొన్నారు!

- అక్టోబరు పెనుతుపానుకు జరిగిపోయిన చెట్లనూ, పూలమొక్కల్నీ నిలబెట్టారు,

- విరిగి, ఎండి, చూపులకు నచ్చని కొమ్మల్ని ఖండించి గుట్టలు పేర్చేవారు పేర్చి ట్రాక్టరు లో నింపేవారు నింపారు,

- ఎండుటాకుల్నీ, పుల్లల్ని ఏరారు,

- విరిగి డ్రైన్ నీటిలో పడినానుతున్న బరువైన కొమ్మల్ని బైటకు లాగారు,

- ఎక్కడైనా పిచ్చి మొక్కలు, గడ్డి కనిపిస్తే నిర్మూలించారు .....

               మొత్తానికి ఆ వచ్చే పోయే వాహనాల్ని తప్పుకుంటూనే జాగరూకులై మరొక 100 గజాల రహదారి పరిశుభ్రతను సాధించారు,

               తక్కిన విశేషాలలా ఉంచి, 2 ట్రాక్టర్ల ఎండు పుల్లల్నీ - కట్టెల్నీ ఒక ట్రాక్టరుగా సర్దిన, త్రొక్కిన బృందావన – విజయులు తమ నేర్పేమిటో చూపించారు!

               చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమమంటే – “చప్పట్లు మ్రోగించే ఉపన్యాసమూ కాదు, ఇలా కూర్చొని కాగితాల మీద మంచి భాషతో చేసే వర్ణనా కాదు” అని ప్రతి వేకువా నిరూపిస్తూనే ఉన్నారు!

వర్షాగమన వేళ అమర స్తూపం సాక్షిగా జరిగిన సమీక్షా సభలో:

1) ఆస్పత్రి ఉద్యోగి నరహరిశెట్టి గౌతముడి నినాదాలూ,

2) DRK వైద్యుని పాముకాటు ప్రమాద నివారణలూ - మెలకువలూ,

3) రేపటి వేకువ కూడ కాసానగర ప్రాంతాననే శ్రమదాన నిర్ణయమూ....

               గొప్ప గ్రామం – స్వర్గ ధామం – 5

స్వార్ధములు మటుమాయమైతే - త్యాగమన్నది మేలుకొంటే -

దేహశ్రమ కలవాటు పడితే - శ్రమకు గౌరవములు లభిస్తే -

పరుల కోసం పాటుబడుటే వ్యసనముగ రూపొందుతుంటే -

అది సుమా! ఆదర్శ గ్రామం! అప్పుడిక అది స్వర్గధామం!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    02.12.2025