పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
స్వచ్ఛ - సుందరోద్యమ ధారావాహికలో 3672 వ ఎపిసోడ్!
నేటి (గురువారం – 4/12/15) రహదారి పారిశుద్ధ్యం కోసం 3 కిలోమీటర్ల దూరంగా వెళ్లిన పాతిక మందిలో 9 మంది చలి వేకువ 4.15 కే ముడుచుకొనక అమరుల స్తూపం వద్ద నిలిచారు చూశారా! చలికి తోడు గాలొకటి! 11 ఏళ్ళుగా రాటు తేలిన ఈ అనుభవజ్ఞులు తప్ప - ఈ వేకువ పారిశుద్ధ్య కృషికి సామాన్య గ్రామస్తులు రావడం కష్టమే మరి!
సామాజిక బాధ్యత ఫీలయేవాళ్ళు తప్ప ఇలా బ్రహ్మకాలంలో ఊరికి ఎడంగా రొచ్చు పనులు చేస్తూ - శుభ్రపడిన100 గజాల రహదారిని చూస్తూ ఆనందించే కార్యకర్తలు ఎక్కడ దొరుకుతారు చెప్పండి!
మహాభారతంలో అర్జునుడు చీకట్లో గురి చూసి, లక్ష్యం ఛేదించే అభ్యాసం చేశాడట! ఈ వాలంటీర్లు 11-12 ఏళ్ళుగా అలాంటి పర్యావరణ శత్రువైన కాలుష్యాల మీద గురిచూసి చీకట్లో కొటుతూనే ఉన్నారు! పదిమంది కోసం చేసే శ్రమత్యాగంలో రుచి మరిగారు కనుకనే అది సాధ్యమయింది!
గ్రామవీధుల - రహదార్ల, డ్రైన్ల - శ్మశానాల కాలుష్య సమస్యలన్నిటికీ ఈ కార్యకర్తల దగ్గర సమాధానములున్నవి!
మహిళలు చీపుళ్లకు పని చెపుతారు, కత్తుల వాళ్లు రోడ్డు మార్జిన్ల గడ్డినీ పిచ్చి మొక్కల్నీ చూసుకొంటారు, డ్రైన్ల తుక్కు సంగతి కొందరు చూస్తారు, బాట ప్రక్క గుంటలు పడితే ముగ్గుర్నలుగురు పూడ్చి, రోడ్డు మనుగడను పెచుతారు, ఒక మరీ పెద్దాయన వాళ్ళకు మంచి నీళ్ళు సప్లై చేస్తే, మరొక వృద్ధ మహానుభావుడు చాక్లెట్లో బిస్కట్లో పంచుతాడు,
ఠంచనుగా సమయానికి చెత్త ట్రాక్టరు వస్తే ఆరేడుగురు వ్యర్ధాల్ని చక చకా అందులో నింపుతారు, విజిలు మ్రోగేప్పటికల్లా కాఫీ సప్లయిదారుడు కప్పులందిస్తాడు,
6.20 కల్లా అమరస్తూపం వద్ద గుమికూడి, ఏ గురవయ్య మాస్టరో నినాదాలు, సూక్తులూ వినిపిస్తాడు,
అదుగో ఆ సమయంలో కార్యకర్తలో – బైటివారో స్వచ్చోద్యమానికి చందాలిస్తారు,
తదుపరి పని స్థలం ఫలానా (రేపైతే కాసానగర్ దగ్గర) అని నిర్ణయించుకొంటారు,
నేటి పని గూర్చి DRK డాక్టరు గారు సమీక్షిస్తారు,
- ఇదే ఈనాటి నాగాయలంక రోడ్డులోని శ్రమదానం!
ఎక్కడో-అమెరికాలో ఉన్న నల్లూరి సూర్యవర్ధన్ మూడేళ్లపాటు ట్రస్టు కార్మికుల్లో ఒకరి ఖర్చుకై మొదటి నెలా 10,000/- చెక్కును పంపిచడం నేటి విశేషం!
గొప్ప గ్రామం – స్వర్గ ధామం – 6
చెడిన పర్యావరణమును పునరుద్ధరింపగ పూనువాళ్లూ
అందుకోసం వేల చెట్లను నాటి సంరక్షించు ప్రజలూ
ఊరి మురికిని కడిగి వేయుట కుద్యమించే కార్యకర్తలు
ఉన్నదేగద మంచి గ్రామం? ఔను నిజమది స్వర్గధామం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
04.12.2025