3673* వ రోజు ... ....           05-Dec-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

శుక్రవారం (5-12-25) నాటి పనిదినం 3673* వది!

               ఆ సంఖ్య ఏ 6000* వరకో ఆగేది కాదు!

               వాట్సప్ లోనో-ముఖ గ్రంథంలోనో చదువరులు కాస్త సామాజిక చైతన్యం ఉన్నవారైతే -

               ఊరంతా సుఖ-సంతోష-ఆరోగ్యాలతో ఉన్నప్పుడే మనం కూడ హ్యాపీగా ఉండగలమనే వాస్తవం గ్రహించిన వాళ్ళైతే -

               మీ గ్రామాల ఉమ్మడి ప్రయోజనం కోసం రోజుకొక్క గంట శ్రమించడానికి మనసుంటే; సమష్టి కృషి పట్ల నమ్మకం ఉంటే…

               ఈ డిసెంబరు 5 నాటి వేకువ శ్రమదాన వివరాలు తెలుసుకోండి!

               - ఈ వేకువ 4.20 కే నాగాయలంక రోడ్డులో మొదలైన 22 మంది రహదారి సుందరీకరణలో ముందుగా నేను గమనించినది అమరవీరుల స్తూపం ఆవరణలో మెండు శ్రీను - జాస్తి ప్రసాదుల దీక్షా దక్షతల పనులు!

- అక్కడి నుండి కాసానగరం దిశగా ముందుకెళితే కనిపించింది పల్నాటి జంట రహదారి ఊడుపు, రోడ్డు మీది మట్టి గోకుడూ!

- 10 గజాల దూరంలో కోడూరు - అంబటి గార్ల శ్రమ విన్యాసాలు!

- ఇంకొచెం ముందు రోడ్డు తూర్పు మార్జిన్ పల్లంలో పెద్ద గుంటను ప్రోగుపడుతున్న వ్యర్థాలతో నింపి, చదును చేస్తున్న కస్తూరి శ్రీను – “బండి శరత్ – హేమంత్ - నాయుడు మోహన్-వగైరాలు!

- డ్రైన్లోనూ, గట్టు మీదా అద్దంలా తీర్చిదిద్దుతున్న బృందావనుడూ, ఇద్దరు ఆస్పత్రి నర్సమ్మలూ, లక్ష్మణరావూ!

- కత్తి పనులలో మునిగిన BSNL నరసింహుడూ, ఈత చెట్టును సుందరీకరిస్తున్న అడపా గురవయ్యా!

- కాసానగరం దగ్గరగా నడుములు వంచి, పార/ దంతెల పనుల్లో సజ్జా – దుర్గా ప్రసాదులు!

- ఇంకొక ఆనందుల వారు మంచి నీళ్ళు అందిస్తూ, స్వచ్చ వైద్యుల వారు అందరి భద్రతలు చూసుకొంటూ! శాస్త్రి గారు శ్రమ దృశ్యాల్ని చిత్రీకరిస్తూ!

               ఇవి నేటి గంటా ఏభై నిముషాల రహదారి సుందరీకరణ దృశ్యాలు!

               ఆపైన 6.25 కు నేటి శ్రమానందముచ్చట్లూ – జాస్తి వారి నినాదాలూ!

               షరామామూలుగానే శంకరుల వారి నెలవారీ 5000/- చందా!

               రేపటి తమ కలయిక కాసానగర్ దగ్గర అనే నిర్ణయమూ!

               డెబ్బది-ఎనుబది చేతులు

ఔరా! ఈ చల్లపల్లి - అవనిగడ్డ బాటలో

అమరవీర స్తూపానికి - కాసానగర ప్రాంతానికి

హరిత - శుభ్ర- సౌందర్యము లందించగ ప్రతిదినం

డెబ్బది-ఎనుబది చేతులు ఎంతెంత శ్రమించెనో!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    05.12.2025