3675* వ రోజు .......           07-Dec-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

                       ఆదివారపు శ్రమదాన వైభోగం! @ 3675*

ఆ వైభవం క్రొత్తా- ప్రాతా వాళ్లతో గలిపి మొత్తం50 మందిది;  మరొక మారు నాగాయలంక రోడ్డులోని కాసానగరం సమీపానిది;

అంతకు ముందటి 4.30-6.00 కాల హద్దుల్ని దాటి, 4.20 – 6.20  అనగా 2 గంటల - టోటల్ గా 70-80 పని గంటలకు చేరినది; కాసానగర ప్రతినిధిగా దాసు, చల్లపల్లి నుండి కళ్లజోళ్ళ నయా ఆస్పత్రి యువకుడు 'వీర' క్రొత్త కార్యకర్తలను కలుపుకొని జరిగినది!

మరొక 150 గజాల రహదారికి చెందిన రకరకాల కాలుష్యాల అంతు చూసిన స్వచ్చంద శ్రమదానం అది! చీకటి చోటైనా- మంచు, చలి గాలి చికాకు పెటుతున్నా- యాతాయాత వాహన వేగాలు జడిపిస్తున్నా-జాగ్రత్తగా, సమాజానికి దిక్సూచిగా, 12 ఏళ్లుగా జరిగే బాధ్యత అది!

- బరువైన కోత యంత్రాన్ని మోస్తూ నిచ్చెన అంచున నిలిచి, చూసే నాబోటి వాళ్లకు ఆందోళన కరంగా చిక్కు పడిన చెట్ల కొమ్మల్ని ఖండించడం చూసినా,

- బాటకు పడమర డ్రైను వద్ద గోనె సంచిలో లేదూడ శవాన్ని చూసీ పని ఆపని ముగ్గురి సేవల్ని గమనించినా,

- పనులు జరిగే రోడ్డు బారునా అంటుకొని బిగిసిన మట్టి సుద్దల్ని ఏడెనిమిది మంది పారల్తో గోకడం తిలకించినా,

-ఒకటికి  రెండుమార్లు  మహిళా కార్యకర్తలు బాటనూ - రెండు ప్రక్కల్నీ ఊడ్చడం కంట బడినా,

-చెరువు గట్టున మార్జిన్ పల్లాన్ని యువ కార్యకర్తలు వ్యర్థాలతో పూడ్చడానికి ఉరుకులు పరుగుల ప్రయత్నాలు దృష్టి కొచ్చినా,

- అసలు ప్రతి కార్యకర్త తన పనిని పరమ ఇష్టంగా-  శ్రద్ధగా చేసుకు పోవడాన్ని పరిశీలించినా

               ఇంతటి సామాజిక బాధ్యుల్ని దగ్గరగా చూస్తున్నా - మాట్లాడుతున్నా...

ఎంత తృప్తిగా – గర్వంగా - చల్లపల్లి గ్రామ భవిష్యత్తు పట్ల ఎంత నమ్మకంగా ఉంటుందో చెప్పలేను!

ఏ 6. 20 కో పని విరమణ విజిల్ వినిపించి, కొందరు అయిష్టంగానే పారిశుద్ధ్య కృషిని

 రేపటికి వాయిదా వేసి, కబుర్లాడుతూ కాఫీలు సేవించి, చెరువుమూల 50 మందీ వరుసలో నిలిచి, రాయపాటి విజయరమా ప్రవచిత త్రివిధ నినాదాలకు స్పందించి,

Dr. DRK గారి సమీక్షా వచనాలు విని, ఒక సీనియర్ కార్యకర్త కోడూరు వెంకటేశ్వర రావు గారి క్రమం తప్పని నెల చందా 520/-కు సాక్షులుగా నిలిచి,  

రేపటి పనులకోసం కాసానగర- NH 216 జంక్షన్ వద్ద కలవాలని నిర్ణయించి, గృహోన్ముఖులయ్యారు!

               ఏమని కీర్తించ వలెను-2

చెట్టెక్కిన వీరుడినా – పుట్ట త్రవ్వు ధీరుడినా-

చెత్త బండి నెక్కి తుక్కు  సర్దుతున్న వైద్యులనా-

ఊరు బైట రోడ్లు కసవు లూడ్చుచున్న నర్సులనా-

ఎవరిని కీర్తించ వలెను? ఎంతని వర్ణించగలను?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    07.12.2025