పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
ముందస్తు క్రిస్మస్ తో బాటు వీధి పారిశుద్ధ్యం - @3692*
అందుకోసం బుధవారం(24-12-25) నాడు AVG రహదారికి బదులు శ్రమదాన స్థలం మారింది. నిర్వాహకులైతే - పండుగ వేడుకకు 47 మంది, ఉభయ వీధుల చక్కదనం కోసం 37 గురూ!
గ్రామ కల్మషాల మీద విరుచుకు పడడంలో ఎంత ప్రత్యేకంగా ఉంటారో క్రిస్మస్ – సంక్రాంతి - దసరా వంటి పండుగల పట్ల కూడ స్వచ్ఛ కార్యకర్తలది అంత ప్రత్యేకతే! వాళ్ళ పర్వదిన నిర్వహణలు ఎప్పుడైనా శ్రమదానపూర్వకంగా ఉండి, స్ఫూర్తిని రగిలిస్తుంటాయి (– కాస్తంత సామాజిక స్పృహ ఉన్న గ్రామస్తులకు!)
రేపటి జాస్తి ప్రసాద్ – లక్ష్మీ రాణి గార్ల మనుమ సంతతి పంచెల వేడుక దృష్ట్యా క్రైస్తవ పండుగ 24 గంటలు ముందుగా జరిగింది. దీనికి కర్తలు సర్పంచి దంపతులు, కర్మలు స్వచ్ఛ కార్యకర్తలు, కేకు కోసిన క్రియాశీల సూపర్ సీనియర్ కార్యకర్త - 94 ఏళ్ల దాసరి రామమోహన మహోదయుడు!
దూరదూరంగా రహదార్ల చెత్తా చెదారాన్నే క్షమించని కార్యకర్తలు కమ్యూనిస్టు వీధిలోని, బైపాస్ మార్గంలోని కాలుష్యాలను ఉపేక్షిస్తారా?
2 భాగాలుగా విడిపోయిన వీధి సేవకులు సుమారు కిలోమీటరు దాక 4.14 - 6.15 నడిమి వేళ ఉభయ వీధుల అవకతవకల్ని సరిదిద్దారు.
బైపాస్ కు ఉత్తర ఉద్యానంలోనే ఏడెనిమిది మంది పనిచేశారు.
ఐదారుగురికి సాగర్ టాకీస్ రోడ్డు సుందరీకరణ అవకాశం దక్కింది, పని జరిగిన మార్గంలో దుమ్ముగాని, చెత్త గాని, ప్లాస్టిక్ లు గాని, పూల మొక్కల వంకరటింకరులు గాని ఉంటే చూసి చెప్పండి!
సామ్యవాద వీధి కి వెళ్లిన కార్యకర్తలదైతే మరీ పని సందడి! వీధి చివరి దాక శుభ్రపడందే ఆగలేదు. నిన్నటి దాకా ఈ 2 చోటులు శుభ్రంగా - అందంగా పచ్చగా లేవని కాదు - స్వఛ్ఛ కార్యకర్తల నేటి 60 పని గంటల కృషితో మరింత ముచ్చటగా మారాయనేదే అసలు సంగతి!
ముందుగా 6.30 కు కృష్ణకుమారి గారి నినాదాలకు బదులిచ్చి, DRK గారి సమీక్షను విని, అల్పాహారం కాదు - అనల్పాహారం ముగించి,
రేపటి వేకువ మన కలయిక అవనిగడ్డ దిశగా అమరులస్తూపం వద్దనని గ్రహించి, కార్యకర్తలు గృహోన్ముఖులయ్యారు!
కర్మ పట్టెనెందుకొ మరి!
అంత మంచి ఇంజనీరు అంబటి శంకర రావు కు
కంటి చికిత్సానంతర కాలములో గ్రామములో
శరత్కాల గగనములో చంద్రుని సాక్షిగ కత్తితొ
కలుపు నరుకు పనులు చేయు కర్మ పట్టెనెందుకొ మరి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
24.12.2025