పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
మరొక ఆదివారపు (28.12.25) శ్రమదాన కథ - @3696*
ఆ కథ 41 మందిది; వేకువ 4.17 కే మొదలై, 6.22 కు చివరి విజిల్ మ్రోగితే అయిష్టంగా ఆగినది, అవనిగడ్డ బాటలోనే కోళ్ల షెడ్డు కేంద్రంగా అటూ ఇటూ ఫర్లాంగు దూరం కాలుష్యాల అంతు చూసినది;
మార్జిన్ల పల్లం వల్ల విరిగిపడే ప్రమాదం నుండి 4 చోట్ల తారు రోడ్డును
రక్షించిన ఆ కథ 20-12-2013 నాడే గంగుల వారి పాలెం రోడ్డులోనే శ్రీకారం చుట్టుకొన్నది!
చలిని లెక్కించక - మంచును పట్టించుకోక- రెండేసి మూడేసి
ఇంకా ఈ సత్కథలో:
- బరువైన రాళ్ల డిప్పను నేను మోస్తానంటే నేనే మోస్తానని ఇద్దరు మహిళా కార్యకర్తలు వాదించుకొని రాజీ పడిన దృశ్యమూ,
- పది రోజుల నలతను పట్టించుకోక స్వెట్టర్ కూడ మరచి, చలిని తట్టుకొంటూ ఫొటోలు తీసే పెద్దాయనా,
- 2 గోనె సంచుల్నిండా ప్లాస్టిక్ చెత్తనూ, చిత్తు కాగితాల్ని ఏరు కొచ్చే దృశ్యాలూ,
- 2 గంటలు శ్రమించినా, చివరి పావు గంటలో లోడింగు కోలాహలమూ,
- ఎవరూ పట్టించుకోని రహదారి భద్రతకు చాలినన్ని రాళ్ల వ్యర్థాలు ఇంకెక్కడ దొరుకుతాయా అనే చర్చలూ, చోటు చేసుకొన్నాయి కూడ!
ఒక యువ కార్యకర్త సాధనాల సతీష్ గట్టి నినాదాలతో మొదలైన సభలో:
1) మొన్నటి జాస్తివారి శతశాతపు హరిత వేడుకా,
2) నాలుగు వారాల శ్రమ మూలంగా ఇంపుసొంపు లీనుతున్న అవనిగడ్డ బాట ప్రస్తావనా,
3) నాదెళ్ల సురేశ్ అనే ప్రవాసాంద్రుని 5 గురు పని రాక్షస ప్రసాదుల వర్ణనా,
4) మరొక ప్రవాసుడు గర్నిపూడి రాజేంద్రుని రోడ్ల చిత్తు కాగితాలు ఏరే సూచన అమలు నిర్ణయమూ,
5) బందరు వీధి షాబుల్ బజారు మూలలోని శంకర ఐ కేర్ లో ఈ రోజు కార్యకర్తలందరికీ ఉచిత కంటి పరీక్షల, నేత్ర రక్షక సులోచనాల పంపకమూ చేస్తానని ‘వీర’ గారి ప్రకటనా !
రేపటి వేకువ కూడ స్వచ్ఛంద శ్రమదాన కార్య రంగం అవనిగడ్డ మార్గమే అనెడి నిశ్చయమూ...
కర్మ పట్టెనెందుకొ మరి!
అంత మంచి ఇంజనీరు అంబటి శంకర రావు కు
కంటి చికిత్సానంతర కాలములో గ్రామములో
శరత్కాల గగనములో చంద్రుని సాక్షిగ కత్తితొ
కలుపు నరుకు పనులు చేయు కర్మ పట్టెనెందుకొ మరి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
28.12.2025