3697* వ రోజు .......           29-Dec-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

పనిదిన సంఖ్య - 3697*, పని వాళ్ల లెక్క-25

               ఈ సోమవారం (29-12-25) నాటి వేకువ శ్రమ సమయం 4:18 నుండి 6:18 ఐతే - శ్రమదాన స్థలి అవనిగడ్డ మార్గాంతర్గత DVR ‘హిమాలయ ఐస్ ప్లాంట్’ ప్రాంతం!

               ఇక తక్కిన కథ షరామామూలే! ఈ బాటకు ఏనాటి ఋణమో గాని, వేకువ 4.00 కే ఇళ్లు వదలి, 3 ఊళ్ళ కార్యకర్తలు ఈ మట్టి - దుమ్ము చెత్త పనుల కోసం పని సమయం 4.30 కు కాక - పది మంది చాల ముందుగానే చేరుకొంటారు!

               4:30 దాటాకా, ఆ పనులు మరీ ముమ్మరిస్తాయి! “స్పర్ధయా వర్ధతే విద్యా” అన్నట్లు అప్పుడప్పుడు ఉత్సాహం కాస్త ఎక్కువై ఈ మురికి పనుల్లో పోటీలూ ఉంటాయి! ముసలి వాళ్ళను వీలైనంత వరకు బరువు పనులు చేయకుండా కుర్రాళ్లు అంది పుచ్చు కొంటారు కూడ!

               నిన్న వేకువ ముల్లు గీరుకొని ఒక తూము వారి చెయ్యి నుండి నెత్తురు కారినట్లు, 20 రోజుల్నాడు ఒక అడపా వాని చేతికి ఈతముల్లు కొట్టినట్లు, చిన్నపాటి ఆటంకాలూ వస్తుంటాయి!

               ఈ పూట మాత్రం మహిళల రోడ్డు ఊడ్పులు ఆగాయా? ఐస్ ప్లాంట్ ప్రవేశం వద్ద మర రంపంతో భారీ ముళ్ల చెట్ల ఖండన మండన లాగాయా? నెల రోజుల క్రిందట బాట తూర్పు భాగం బాగు చేసినా, ఈ పూట తమకు నచ్చేదాక 15 మంది కార్యకర్తలు శుభ్ర - సుందరీకరణను ఆపారా? ఆ పని క్రమంలో చీకట్లోనే గుబురు చెట్ల మధ్య దిక్కుమాలిన వ్యర్ధాల్ని ప్రోగేయడం మాత్రం ఆగిందా?

               నిజమే - కష్టం ఉంటది - ఒక్కోచోట మూత్రవిసర్జన కంపూ ఉండొచ్చు. బరువు పనులప్పుడు చెమటలూ కారుతవి - బట్టల మురికీ తప్పదు - అందుకని పాతిక మందిలో ఏ కార్యకర్తా వెనకడుగేయలేదే!

               6:15 తర్వాత - విజిల్ మీద విజిల్ మ్రోగినప్పుడు - తెల్లారి వెలుగులో అప్పటిదాక తమ శ్రమసార్థకమై, హరిత-శుభ్ర-సుందరమైన అవనిగడ్డ రహదారిని చూసుకున్నాక వాళ్ళకు తాము పడిన కష్టం కాదు – తాము సాధించిన పర్యావరణహితమే గుర్తుకు వస్తుంది మరి!

               నేటి సమీక్షలో కార్యకర్తల 5 రకాల పనుల్నీ, వాటి వల్ల ఊరి వారికి జరిగే మేలునూ విశ్లేషించారు,

               నిన్నటి కార్యకర్తలు 8.00 నుండి పావుగంట తమ వీధుల్లో చిత్తుకాగితాలేరిన వీడియోలను ప్రస్తావించారు,

               కంటి వైద్యుడు ‘వీరబాబు’ నిన్న కార్యకర్తలకందించిన ఉచిత కంటి పరీక్షల సేవలను గుర్తించారు.

               రేపటి వేకువ సైతం DVR ఐస్ ప్లాంట్ (అవనిగడ్డ రోడ్డు) వద్ద కలుసుకోవాలని నిర్ణయించారు.

                              ద్వంద్వ రీతిన

కత్తి పదునూ, మాట పదునూ కదం త్రొక్కును వీదులందున

కలుషములపై కత్తి దూస్తే ఖండ ఖండమె పిచ్చి మొక్కలు

వ్యావసాయం, ఊరి కార్యం ద్వంద్వ రీతిన నడుపు చుండే  

ప్రసాద్ సజ్జా – అతడు రైతా? స్వచ్ఛ సుందర కార్యకర్తా?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    29.12.2025