3698* వ రోజు .......           30-Dec-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

విజయవంతమైన మరొక శ్రమదానం! @3698*

               మంగళవారం (30-12-25) వేకువ సమయాన మళ్లీ మంచు విజృంభించింది, చలి పెరిగింది కాని కార్యకర్తల సంఖ్య తగ్గలేదు – నిన్నటికన్న కాస్త పెరిగి 27 గా ఉంది!

               ముళ్ళ చెట్ల వద్ద పనులు కనుక జాగ్రత్తగా - నెమ్మదిగా చేయవలసి వచ్చినా, కార్యకర్తల పట్టు సడల లేదు. పని స్థలం మాత్రం ఊరు దిశగా కొంచెం ముందుకు జరిగి, DVR ఐస్ ప్లాంటు కేంద్రంగా మొదలై, పడమటి కాల్వ గట్టు రోడ్డు వైపుకు విస్తరించింది.

               ఎండు ముళ్ల కంపల పనిలోనే డజను మంది 4:25-6:15 ల నడుమ కష్టించారు. అవి ఖాళీ కంపల గుట్టలు కావు, అడుగున అన్ని క్యారీబ్యాగులు, గాజు-ప్లాస్టిక్ సీసాలూ, చీకిపోయిన గోనె సంచులు, ప్రాత గుడ్డలు, వగైరాలను విడగొట్టి, కొమ్మలు నరికి, విడివిడిగా లోడింగు చేయడమే నేటి ప్రధాన శ్రమదానం!

               నాలుగు రోజుల పిదప పునరంకితుడైన మెండు శ్రీను, పడమటి వీధి క్రొత్త కార్యకర్త మస్తాను, సీతారామయ్య వంటి వారి సేవలు లభ్యమైనందుననే ఐస్ ప్లాంట్ ప్రవేశ ప్రదేశం ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా శుభ్రపడింది!

               ఎంత జాగ్రత్తగా పనిచేసినా ఒక సీసా పెంకు ఆకుల వాని చేతి వేలు రక్త స్రావ కారణమయింది. ఐతే ఇలాంటివి కార్యకర్తలెప్పుడో పట్టించుకోవడం మానేశారు!

               27 మందికి చెందిన నేటి శ్రమకు సాక్ష్యంగా ఖాళీగా – అందంగా - శుభ్రంగా మారిన ప్రాంతమూ, అంతెత్తున వ్యర్ధాలు నిండిన చెత్త బండీ! ఊరి జనులంతగా పట్టించుకోని పౌరసమాజ బాధ్యతల్ని నెరవేరుస్తున్న తృప్తేమో స్వచ్ఛ కార్యకర్తలది!

               నిన్నటి సమీక్షా సమావేశం అంబటి శంకరరావు నినాదాలతోనూ,

               నేటి సభ మల్లంపాటి ప్రేమానంద్ తోనూ ప్రారంభమై,

               రేపటి మన శ్రమ కూడ అవనిగడ్డ బాటలోని హిమాలయ ఐస్ ప్లాంటు వద్దనే అనే సందేశంతో ముగిసింది!

                     నేలపై కాళ్లారజాపి...

కొర్రపాటి వీర సింహుడు గొర్రు చెత్తను లాగుతుంటే-

స్వంత పని వాయిదా వేసి స్వచ్ఛ సేవకు పూనుకొంటే-

నేలపై కాళ్లారజాపి, కలుపు చక్కగ చెక్కుతుంటే-

‘ఏమిటీతని వెర్రిరా’ అని ఎవరికైనా తోచు నంతే!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   30.12.2025