పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
నెలకూ, సంవత్సరానికీ తుది శ్రమదానం - @3699*
ఈ బుధవారపు (31-12-25) వేకువన ఆ దాతృత్వం 4.20-6.17 మధ్య చోటు చేసుకొనెను. 4.30 AM అనే కాల నియమాన్ని ఉల్లంఘించిన 14 మందైతే - అవనిగడ మార్గంలోని హిమాలయ ఐస్ కర్మాగారం వద్ద. అప్పటికే కవ్విస్తున్న మంచులో నిలబడిరి. మరో 22 మంది వచ్చి కలిశాక ఆ సమూహ శక్తి పూర్తి స్థాయిలో విజృంభించెను!
ఏదో - ఆరేడుగురు (రహదారి ఊడ్పుల వాళ్ళు) తప్ప అందరూ రహదారి తూర్పు ప్రక్క చక్కని - చిక్కని హరిత భాగము నందే శ్రమించిరి! అంతకు ముందే ఆ ప్రదేశము శుభ్రముగా లేదని కాదు - కార్యకర్తలకు ఆపాటి పరిశుభ్రత, ఆ బాట అందమూ చాలలేదు!
పైగా ఈ 2-3 వారాల వ్యవధిలో కొన్ని సీసాలు ఆ చోటు యొక్క శుచీ - శుభ్రతలకు నష్టదాయకమయ్యెను; 2 నెలల క్రిందటి తుఫానుకు విరిగి పడి, ఎండిన చెట్ల కొమ్మలూ కనిపించెను.
మరి అలాంటప్పుడు సౌందర్యారాధకులగు కార్యకర్తలు సహించగలరా? కొందరు కత్తులకు పని చెప్పి కొమ్మలు సైజుగా నరకగా,
కొందరు గడ్డి చెక్కగా, మరొకాయన గొడ్డలి వ్రేటులకు పూనుకోగా,
దంతెల వారు వ్యర్ధాల్ని ప్రోగులొనర్చే పనిలో నిమగ్నులవగా, ఒకరిద్దరు సేకరణా నిపుణులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ల - గాజు - ప్లాస్టిక్ సీసాలను సమీకరించుచుండగా,
ఏడెనమండుగురు లోడింగు పనుల సమయ పాలనలో కనుపించిరి! దట్టమగు మంచులో వచ్చు-పోవు వాహనాలతో పొంచియున్న ప్రమాద హెచ్చరికలు పదే పదే వినిపించెను!
ఒక అత్యంత పెద్దాయన మంచి నీళ్లందిస్తుండగా, 2 వ ర్యాంకు పెద్దాయన తనివి తీరా ఆ సామాజిక శ్రమ దృశ్యాలను ఫోనులో బంధించుచుండెను!
దేశమందెక్కడా కనిపించని ఈ 36 మంది శ్రమ జీవన సౌందర్యాన్ని DRK డాక్టరు ఆనందాశ్చర్యాలతో గమనించుచుండెను!
6.30 సమయములో జిల్లా పాలనా కార్యాలయోద్యోగి తూము వెంకటేశ్వరుల వారు క్రొత్త సంవత్సరంలో కలెక్టరు గారి నిర్ణయాలను వివరించే ముందు ఉద్యమ ఉద్దేశ్యాన్ని 3 మార్లు నినదించెను!
అవనిగడ్డ రహదారికి బదులు రేపటి శ్రమస్థలి గ్రామ కేంద్రమగు 3 రోడ్ల - కోటగోడ (కూల్ డ్రింకు) సెంటరు గా నిర్ణయించిరి!
కన్నులెర్రగా మారుచుండును
అతని సమయస్ఫూర్తి ఊరికి అప్పుడప్పుడు ఉపకరించును
చెమట కార్చుచు వీధులందున పనికి దిగడం తనకు నచ్చును
కలుషముల పై కోపమొస్తే కన్నులెర్రగా మారుచుండును
అతడె సత్యం పసుపులేటి – స్వచ్ఛ సేవల లోన మేటి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
31.12.2025