పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
రౌండ్ ఫిగర్ గా నేటి పని దినం 3700*
38 మంది కార్యకర్తలు క్రొత్త ఏడాదిలో (గురువారం- 1-1-2026) తమ బాధ్యతలకు శ్రీకారం చుట్టింది VJA - Avg - MTM రోడ్ల కూడలిలో; స్వచ్ఛ సుందరీకరణ ప్రస్థానం సాగింది 2 ½ వీధులలో; మంచు మధ్యస్తంగా కురిసిన వేకువ 4.20-6.20 కాలమే అందుకు సుముహూర్తం!
ఇటు అవనిగడ్డ వీధిలో పెట్రోలు బంకు దాక, అటు బందరు వైపు సుమారు
సంతవీధి దాక, కొసరుగా విజయవాడ బాటలో కొద్దిదూరం వాళ్ల శ్రమదాన వీరవిహారం విస్తరించింది.
‘ఎవరేం సాధించారు’ అనేకంటే – “ఇంకా ఆ 2-3 వందల గజాల వీధుల్లో ఇప్పుడింకా దుమ్ము – చిత్తు - ప్లాస్టిక్ ముక్కలూ, రోడ్డు మరకలూ ఏమైనా మిగిలాయా? అన్ని ఊళ్ల సెంటర్లకన్న ఈ చల్లపల్లి ముఖ్య కూడలి అద్భుతంగా ఉందా - లేదా?” అనే ఆలోచించాలి.
ఒక్క ATM సెంటరులో - గుడుల వద్ద మాత్రం విద్యుత్ వాహనాల ప్లాట్ ఫారం అడుగున తప్ప ఇంత స్వచ్ఛ సౌందర్య విరాజిత వీధికి వంకబెట్టేందుకేమున్నది?
క్రొత్తది - అది ఆంగ్లకాలమాన సంవత్సరమే గాని - ఉదయాన్నే 99% మంది- గుడులకు వెళ్తారు, మిత్రులకు మిఠాయిలూ, పళ్లూ, బొకేలూ ఇచ్చుకొంటారు, ఉత్సాహంగా - ఉత్తేజంగా కనిపిస్తారు! స్వచ్ఛ కార్యకర్తలు మాత్రమే వీధులూడ్చి, అద్దంలా మెరిపించి, శ్రమదానానంతరం స్వచ్ఛ నినాదాలు చేస్తూ కేకులు పంచుతూ, పర్యావరణ ప్రియ నార సంచులు పంచుతూ విభిన్నంగా క్రొత్త సంవత్సరాన్ని జరుపుకొంటారు!
ఏం చేస్తారు - ఈ మలిన వీధుల, దుర్వాసనల, కళావిహీన గ్రామం కార్యకర్తలనుదుట వ్రాసిన వ్రాత మరి! ఎవరు వదిలేసినా గ్రామ బాధ్యతల్ని వదులుకోజాలని బలహీనత వాళ్లది!
6.30 తర్వాత బట్టలు దుమ్ముకొట్టుకున్నా, కార్యకర్తల ముఖాలు బాధ్యత నెరవేర్చిన తృప్తితో వెలుగుతున్నాయి. చల్లపల్లి సౌందర్యకారకురాలు T. పద్మావతి గారి త్రివిధ నినాదాలతో - నందేటి గాయక చైతన్య ప్రబోధాత్మక గీతాలతో-
ప్రాతూరి శాస్త్రి గారు 3700 వ రోజు సందర్భంగా 3700/- చెక్కును, వేముల శ్రీను పంచిన క్యాలెండర్లతో - పెద్దగా వీటిని పట్టించుకోని అక్కడి గ్రామస్తుల వైఖరితో..
నేటి శ్రమసందడి పరిసమాప్తి!
పాలడుగు రత్న కుమార్ – కంఠంనేని జ్యోత్సా దేవి గార్లు 12000/- రూపాయలను ‘మనకోసం మనం’ ట్రస్టు కు ఆన్లైన్ లో బదిలీ చేశారు.
రేపటి శ్రమ కోసం మనం అవనిగడ్డ బాటలో కలుద్దాం!
వాస్తవంలో బ్రతుకవయ్యా!
నీ కవితలందరు చదువుతారని, కార్యకర్తలు మెచ్చుతారని
ప్రజలు పూర్తిగ మారుతారని, స్వచ్చోద్యమంలో చేరుతారని
ఊరమాంతం మారుతుందని.... ఊహలో విహరించు ఓ న
ల్లూరి రామారావు! కొంచెం వాస్తవంలో బ్రతుకవయ్యా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
01.01.2026