3701* వ రోజు .......           02-Jan-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ద్వితీయవిఘ్న రహితంగా 2-1-26 (గురువారపు) శ్రమదానం -@3701*

               శ్రమను ధారపోసిన కార్యకర్తలు 27 మందే, శ్రమ ప్రభావిత అవనిగడ్డ రహదారి బండ్ల సుబ్బనాగన్న ఆశ్రమ ప్రాంతమే, శనిలా పట్టి వదలనిది మంచే, ఐనా చెదరనిది వాళ్ళ దృఢ సంకల్పమే! నేటి దీక్షా సమయం కూడ 4.20 - 6.15 AM. కాలమే!

               క్రొత్త ఏడాదిలో 2 వ రోజు కూడ సువిశాల హరిత సుందర రహదారికి తూర్పు, పడమరలుగా నర్సులు, డాక్టర్లు, విద్యాసహితులూ, ఉన్నత విద్యారహితులూ మరొక 100 గజాల మేర జరిపిన సుందరీకరణకు సాక్ష్యాలుగా :

- పుల్లా పుడకా, ఆకులలములూ, ప్లాస్టిక్ ల దౌర్భాగ్యములూ, గాజు - ప్లాస్టిక్ వస్తువులూ కనిపించని పరిశుభ్ర రహదారి భాగమూ,

- ఒక మాజీ రైతు అనుభవంతో వ్యర్ధాలతో సర్దిన  ఎత్తుగా ఉన్న ట్రాక్టరూ

- ఎండు కట్టెలు లేని, దుమ్మూధూళీ కనిపించక నిగనిగలాడే నల్లని తారు రోడ్డూ,

- డి.ఆర్.కె - శంకరులు తీసిన శ్రమదాన ఛాయాచిత్రాలూ,

- అన్నిటినీ మించి, రోజును ఒక మంచి బాధ్యతతో మొదలెట్టిన సంతృప్తితో కార్యకర్తల ముఖాలూ,

               కనిపించడం లేదా?

సోకాల్ట్ ప్రజాస్వామ్య సమాజంలో.....

బాధ్యతల నిర్వహణలో మునిగి తేలే వాళ్లూ ఉన్నారు,

‘బాధ్యతలెవడిక్కావాలి? మా హక్కుల సంగతేమిటి’ అనే వాళ్లూ ఉన్నారు!

               మొదటి వర్గం వాళ్లు ఈ స్వచ్ఛ సుందర కార్యకర్తలు. అందుకొక ఉదాహరణ - 5.50 దాక నడుం నొప్పిని పంటి బిగువున ఓర్చి,  వైద్య బాధ్యతల కోసం నిష్క్రమించిన ఈ ఊరి స్వచ్ఛ వైద్యుడే!

               మధ్యలో కొన్నాళ్లు మానేసి, గ్రామ స్వచ్ఛతకు పునరంకితుడైన శ్రీమాన్ కొర్రపాటి వీరాధి వీరసింహుల వారే నేటి ఉద్యమ నినాద కర్త!

               బళ్ల సుబ్బనాగన్న ఆశ్రమమే రేపటి మన తొలి కలయిక ప్రదేశము!

                   వయసు డెబ్భై దాటి కూడా

అయ్యా రాధా కృష్ణ గారూ! అంతగా ఆవేశమెందుకు?

వయసు డెబ్భై దాటి కూడా స్వచ్ఛ సేవల వ్యసనమెందుకు?

అదీ గాక - పదేసి వేలుగ అంత చందాలిచ్చుటెందుకు?

ఎందుకయ్యా చల్లపల్లి ని ఇంతగా ప్రేమించు చుందువు?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    02.01.2026