3702* వ రోజు .......           03-Jan-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

3702* వ నాటి రహదారి సుందరీకరణ దృశ్యాలు చూద్దాం రండి!

               శనివారం(3-1-26) వేకువ 4. 15- 6.20 నడుమన అవనిగడ్డ బాటలోని బళ్ల సుబ్బ నాగన్న ఆశ్రమానికి దక్షిణ- ఉత్తర దిశల్లో 2 కిలోమీటర్లకు 37 మంది బాధ్యతలు పరిమితమైనవి!

               చల్లపల్లి  స్వచ్ఛ కార్యకర్తల కృషి ఏ పూటకాపూట నవనవోన్మేషమే గాని, ఈ  వేకువ అది క్రొత్త పుంతలు తొక్కింది, గత దినాలకు భిన్నంగా సాగింది!

                3-4 కిలోమీటర్ల బారునా పరచుకొన్న వరి ఊక అందుకు కారణం! అందుకనుగుణంగా ఈ 37 గురూ 3 ముఠాలుగా చీలారు! చీపుళ్లూ, డిప్పలూ, అందుకొన్న 17,9 మంది కాసానగర్, చల్లపల్లి వైపుగా ఊడుస్తూ- పొట్టు ప్రోగులు ట్రాక్టర్లో లోడు చేస్తూ చెరో కిలోమీటరు- అంటే, అటు NH 216 దాకా, ఇటు పోతురాజు గుడి దాకా వీర విహారం చేశారనుకోండి!

               వీరిలో 11 మంది మహిళా కార్యకర్తలున్నూ! సొంతానిక్కాక ఊరి కోసం చేసే శ్రమదానంలో మళ్లీ పోటీలు కూడ! (- ఊడ్చే వాళ్లకూ, ప్రోగు లెత్తే వాళ్ళకూ!) సమయం 6.00 ఐపోతున్నదనీ, విజిల్ మ్రోగే ముందే మిగిలిన 50 గజాల కాసానగర దారి శుభ్రత పూర్తి గావాలనీ వాళ్ళ హడావిడి చూశారా? ఆస్పత్రి నర్సు జ్యోతి చీపురుతో ఎందుకలా పరిగెత్తుతున్నదో ఆలోచించారా?

               3 వ బ్యాచ్ ది కత్తి- దంతెల పనన్నమాట ! ఇక్కడ కూడ ఒకాయన ‘ తెల్లారి పోయింది - కబుర్లాపి, గడ్డి చెక్కే పని చూడండని కేకేస్తున్నాడు! ఇంకో వణిక్ప్రముఖుడు పెద్ద గోనె సంచీడు ప్లాస్టిక్- గాజు తుక్కులు ఏరడం పూర్తి చేసేశాడు! మొత్తానికి అనుకొన్న మేరకు ఎవరి పనులు వాళ్లు పూర్తి చేశారు! 

               మరి- ఈ వివరాలు చదువుతుంటే పాఠకులకు ఏమనిపిస్తున్నది?

నాకైతే :

పరుల కోసం పాటుబడని నరునిజన్మం దేనికనీ?

 మూగ నేలకు నీరందించని వాగు పరుగూ ఎందుకనీ....అనే సి.నా.రె, గజల్  గుర్తొస్తున్నది! పరోపకారార్థమ్ ఇదమ్ శరీరమ్ అనే సంస్కృత నానుడి గుర్తొచ్చింది!

- ఆశ్రమంలో సమీక్షా సభలో :

1) సజ్జా ప్రసాదుగారి నినాదాలూ,

2) లంకె సుభాషిణి గారి మిర్చి పంపకమూ,

3) మరొక 5,000/- గుప్తదానమూ,

4) రేపటి శ్రమదానంకూడా అవనిగడ్డ రాహదారిలోననే సంగతీ ప్రధానాంశాలు!

               ప్రజారోగ్యం బాటపట్టీ

పదవి దర్పం వదలిపెట్టీ, ప్రథమ మహిళను మాట మరచీ

పదవి ఉన్నా లేకపోయిన ప్రజారోగ్యం బాటపట్టీ-

పైట దోపీ, బారు జడతో – పట్టుదలతో దంతె పట్టీ

పైడిపాముల వారి కోడలు స్వచ్ఛ సేవకు వచ్చె నదిగో!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    03.01.2026