3703* వ రోజు .......           04-Jan-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

             “ఊహ కందని త్రోవ - ఊరి ప్రజలకు సేవ...”  @3703*

ఆ సేవ 50-1 మంది స్వచ్ఛ కార్యకర్తల ఆదివారం (4-1-26) వేకువ 4.18- 6.16 మధ్య సమయానిది; ఊరి పట్ల తమ కర్తవ్యంతో ఉసూరుమని కాక హుషారుతో - 4  సం మొదలు 87 ఏళ్ల  కార్యకర్తల రకరకాల సేవలను చూస్తున్న DRK వైద్యునికి 7-8  ఏళ్ళ క్రితం అప్పటి స్వచ్చంద శ్రమ యజ్ఞం పట్ల అవనిగడ్డ కవి గుడిసేవ విష్ణు ప్రసాదుగారి స్పందనాత్మకగీతం లోని ఈ శీర్షిక భాగం గుర్తుకొచ్చిందట!

 ఉరిమి ప్రభాకర వడ్ల మరకు దక్షిణాన- అక్కడ  వీధి లైట్లు మినుకు మినుకు మన బట్టికాని- ఇందరి ఉనికే తెలియనంత మంచు! బస్సులు, ఆటోల వేగంతో ఏ ప్రమాదం జరుగుతుందో అనే ఆందోళన మధ్య -–4 ఏళ్ల పాప పనిచేసే చోట లైటు తోనూ, 87 ఏళ్ల పెద్దాయన మంచి నీళ్ళందిస్తూ  తిరుగుతుంటేనూ,

ఒక హేమంతుడు నిండు ట్రాక్టరు పై గజం ఎత్తున నిలబడి తుక్కు సర్దుతుంటేనూ, విషప్పురుగుల చోట 25 మంది శుభ్రపరుస్తుంటేనూ,

కస్తూరి, BSNL, బృందావన, అంజయ్యాదులు ముళ్ళ కంపలు మోస్తుంటేనూ,

 నిన్న ఊడ్చిన అవనిగడ్డ మార్గాన్ని మళ్లీ మహిళలు ఊడుస్తుండగానూ, 

ఇద్దరు షణ్ముఖ- మెండు శ్రీనులు బస్తాల కొద్దీ ప్లాస్టిక్ తదితర తుక్కును ఏరుతుండగానూ,

ఈ అరుదైన శ్రమజీవన సౌందర్య సన్నివేశాలను శంకరుల వారు ఫోటోలుగా మార్చు చుంటేనూ ...

మరి విష్ణు ప్రసాద్ వంటి కవితా హృదయులకు అలాంటి పాటలు వ్రాయాలనిపించదా?

               రహదారి పడమర 4 గురు నర్సులూ, 6 గురు ఇతరులూ- ½ గంటకు పైగా చేసిన శ్రమతో తూముల - ఒరల తయారీ ముఖద్వారం  ఎంతగా శుభ్ర- సుందరంగా మారిందంటే- అదాటున చూస్తే ఆ ఓనర్సే గుర్తుపట్టలేరేమో అన్నంతగా!

సొంతూరి పట్ల ఎంతో కొంత ప్రేమ, సమాజం పట్ల కాస్తంత శ్రద్దా ఉన్నవాళ్లను చూశాంగాని, - మరీ ఇలా పుష్కరాల పాటు జరిగే శ్రమ యజ్ఞాన్ని ఎక్కడ చూడగలం?

ఈనాటి సుస్పష్ట నినాద కర్త మెకానిక్ భరత్ అనే యువ కార్యకర్త, ఎప్పటి లాగే ఈ స్వచ్చ సుందరీకరణ యజ్ఞాన్ని మెచ్చినది డా.డి.ఆర్.కె.

రేపటి మన Avg రహదారి పరిచర్యల కోసం కలువదగింది ఉరిమి ప్రభాకర రైసుమి ల్లు వద్ద!

                  ఐన వాళ్ళను – కాని వాళ్లను...

ఊరి సౌఖ్యం, ప్రజారోగ్యం ఉడుం పట్టుగ సాగవలెనా?

ఐన వాళ్ళను – కాని వాళ్లను అంతగా ప్రేమించదగునా?

వైద్య కష్టం చాలాకా? ఈ ఊరి బరువును మోయవలెనా?

ఏమి దాసరి రామకృష్ణా! ఇంత వ్యామోహములు తగునా ?

-  నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    04.01.2026