పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
3704* వ నాటి - సోమవారం వీధి బాధ్యతలు!
ఈ 5-1-26 వ తేదీ కూడ అటు మంచూ చలీ తగ్గలేదు, అలాగని 26 మంది కార్యకర్తలూ అవనిగడ్డ రహదారి సేవలు మానలేదు.
నడుము పట్టేసిన డాక్టరు, 15 రోజులుగా నలతగా ఉన్న మాజీ హిందీ టీచరు, ఆస్పత్రి డ్యూటీకి 7.30 కు వెళ్లవలసిన నర్సులు, పొలం పనుల బాధ్యతల రైతులు, వ్యాపారులు, భారీ వృద్ధ కాయులు..., ఎవ్వరూ ఈ చీకటి శీతల వేకువ బాధ్యతల్ని ప్రక్కన పెట్టలేదు!
సందడి పనుల చెక్ పోస్టు వారు, మాజీ ఉన్నతోద్యోగులు, ఊరి పొలిమేర దాటి ఈ మురికి, కంపు పనుల్లో ఎందుకంత సంతోషం పొందుతారో తెలుసుకోవలసిన అవసరం ఈ గ్రామస్తులకు లేదా?
ఈ 6.05 సమయానికి....
ఒక హేమంతుడు ఐదారుగురందిస్తున్న తుక్కు పనల్ని ఎడాపెడా సర్దుతూ ట్రాక్టర్లో
కనిపిస్తున్నాడు,
వీధి చెత్తను
1) ప్లాస్టిక్ సంచులు
2) గ్లాసులు-సీసాలు-గాజు వస్తువులు
3) ఇతర లూజు తుక్కులుగా ఏరి, విడగొట్టి సంచులకెత్తే వాళ్ళింకా తమ పనిలోనే మునిగున్నారు,
పాటల శ్రీనైతే ఠంచనుగా కాఫీ కోసం పని మాని, చల్లపల్లి వెళ్లాడు,
ఇంతింత పని సందడి ఆనందంలో ఒక సీనియర్ వైద్యుడూ, ఇంక మంచి నీళ్లు సరఫరా చేస్తూ ఇంకొక సూపర్ సీనియర్ కార్యక్తా ఉంటే....
ఎటొచ్చి, ఇంతటి అరుదైన సామాజిక – సామూహిక శ్రమవేడుకలో పాల్గొనే - కనీసం వచ్చి చూసే అదృష్టానికి గ్రామస్తులే దూరంగా ఉన్నారు!
ఎవరి వంతు కర్తవ్యాలు ముగించిన సంతృప్తితో కార్యకర్తలదుగో - కాఫీల బండి వద్దకు తిరిగొస్తున్నారు!
సమీక్షించే Dr. DRK, నినాదాల కోసం గొంతు సవరించిన గంధం వెంకటేశ్వరరావు వాళ్ల వంతు పని ముగించారు!
కోడూరు వెంకటేశ్వరరావు గారి నెలవారీ చందా 520/- అందుకుని,
రేపటి వేకువ కూడ రైసుమిల్లు వద్దనే కలవాలనే నిర్ణయంతో నేటి బాధ్యతల పూర్తి!
ఇష్టపూర్వకమైన యజ్ఞం!
గ్రామమునకై ఆమె కష్టం, కొందరికి తన గుప్తదానం
ఊరి సొగసుకు నగలు అమ్మే ఉత్తమోత్తమ సాహసం
కార్యకర్తల, ట్రస్టువారల కాచుకొను దీటగు ప్రయత్నం –
ఇదే పద్మావతీ మేడం ఇష్టపూర్వకమైన యజ్ఞం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
05.01.2026