3705* వ రోజు .......           06-Jan-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ఈ 3705 *వ వేకువ  (6-1-26) కూడా...!

- రహదార్ల శుభ్ర- సుందరీకరణ వ్యసనపరులు 4.16 కే అవనిగడ్డ బాటలోని అతి పెద్ద వడ్ల మర దగ్గర ప్రత్యక్ష మయ్యారు.

-  కార్యకర్తల సంఖ్య మాత్రం ఊరి జనాభాతో పోలిస్తే బాగా పొదుపు పాటించి రెండు డజన్లకే పరిమితమయింది!

- అలాగని రోడ్డు సుందరీకరణల్లో ఏ లోపాలూ జరగలేదు!

- వచ్చిన వాళ్లు వచ్చినట్లే క్షణాల్లో చేతొడుగులు ధరిస్తారు,

కొందరు తలదీపాలు తగిలించుకొంటారు, అవసరాన్ని బట్టి గడ్డిచెక్కే పారలో, పిచ్చిచెట్ల పని బట్టే కత్తులో, మర రంపమో, గునపమో అందుకొంటారు,

- రెండుమార్లు విజిల్ మ్రోగందే -6. 15 కు ముందు పన్లు విరమించరు,

- కొందరైతే 6.20 దాక ఈల శబ్దాల్ని లెక్క చేయక క్రమశిక్షణ నుల్లంఘిస్తారు!

- ఒక్క గంట పనుల తర్వాత, రకరకాల వ్యర్థాలు గుట్టలు గా తేలాక - డిప్పలందుకొని  చెత్త లోడింగుకు దిగుతారు- అప్పటికి కాస్త వెలుతురు వచ్చి, హుషారు పెరిగి, వాళ్ళ పనులు వేగవంతమౌతుంటాయి!

               ఇదేదో కూలికోసం - కూటి కోసం, ఖ్యాతి కోసం జరిగే శ్రమదానమైతే ఈ పద్ధతిలో పుష్కరాల తరబడి జరుగుతుందా?

ఊరూ, వల్లకాడులూ, గ్రామ వీధులూ, చుట్టూ ఎనిమిదో- తొమ్మిదో రహదారులూ సౌందర్య ప్రియులకు సమ్మోహనంగా, సామాజిక విశ్లేషకులకు ఆశ్చర్యకరంగా, హరిత శుభ్ర సుందరంగా రూపొందేవా?

ఎక్కడెక్కడి చైతన్య వంతులో ఈ నమ్మశక్యం గాని సామూహిక శ్రమ దానాన్ని రకరకాలుగా ప్రోత్స హించేవారా?

జలుబూ, జ్వర పీడితుడై కూడ ఒక స్వచ్చరథ సారథి ఇంత మంచులో2 గంటల శ్రమదానమేల చేయవలె?

కాఫీల సరదా పిదప :

1) తన పుట్టిన రోజును పవిత్ర కార్యకర్తల మధ్య- లడ్డుల పంపకంతోనూ,

2) ఎలుగెత్తి స్వచ్చ సుందరోద్యమ నినాదాల పూర్వకంగానూ జరుపుకొన్న పలనాటి అన్నపూర్ణ,

3) రేపటి శ్రమ దాన స్థలం కూడ ఉరిమి ప్రభాకర వడ్లమర ప్రాంతమే అనే ప్రకటన,

4) స్వచ్చ కార్యకర్తలకు చిరకాలం సహకరించిన ఉడత్తు రామారావు గారికి శ్రద్ధాంజలీ...

                  సర్వ సౌఖ్యములనుభవించక

 సమున్నతమగు బ్రతుకు గడపక – సర్వ సౌఖ్యములనుభవించక

అమాయకులగు రోగులందరి మోసగించీ డబ్బు గుంజక-

పైసలను ప్రోగేసి మూటలు వారసులకు దోచి పెట్టక-

“ప్రజా క్షేమము, సమాజ బాధ్యత....” మాటలేమిటి రామకృష్ణా!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    06.01.2026