పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
జోరు తగ్గని రహదారి సేవలు - @ 3707*
అవి గురువారం ( 8.1.2026)నాటివి, తల- గొంతు నొప్పులతో ముగ్గురు మానకుంటే రహదారి బాధ్యుల సంఖ్య 33 అయ్యేది!
1) పనివేళలు 4.30-6.00 గా నిర్ణయించుకొని కూడ వీరిలో కొందరు 4.15 కే ఎందుకక్కడ తయారౌతారు?
2)... రైతిరిబో – ఊరు చాలక వెలి రహదార్ల సంగతి వాళ్ళకేల?
3 ) బ్రహ్మముహుర్తపు పుణ్య ఘడియల్లో దేవాలయాలకు కాక ఇలా మురుగ్గుంటల - కంపుల శుభ్రతకై ఆరాట పడనేల?
4) పడితే పడిరి - 6.22 దాక ప్రభాకర వడ్లమిల్లు డ్రైన్లలో విరిగి పడిన చెట్లను ఖండించి, గుట్టలుగా పెట్టవలెనా?
5) పెట్టిరిబో- దైవ కార్యమా అన్నట్లు ఆ 200 గజాల బాట ను క్షుణ్ణంగా ఊడ్వడానికదేమైనా వాళ్ల ఇళ్ళా? వీధులా?
6) మరొకాయన నిచ్చనెక్కి మరీ కాపలా గది పై భాగాన్నంతగా శుభ్రపరచాలా?
7) బాగా కలిగిన ఇళ్లలో పుట్టి పెరిగి, ఉన్నతంగా ఉద్యోగించి, ఇంట్లో పరుండక ఇందరు పెద్దలకు ఈ రహదార్ల బాగు చేతల పిచ్చేమిటి?
8) తమ పని స్థలంలో కదల్లేక కదులుతున్న రక్త పింజరను బృందావన-కస్తూరి శ్రీనులు చంపక ప్రక్క పొలంలో వదలిన జీవ కారుణ్యమెట్టిది?
9) బళ్ల కొద్ది వ్యర్థాలు ప్రోగు చేతలెందుకూ, అదేదో ఇష్టమైన ఆటలాగా ఏడుగురి లోడింగు లెందుకు?
10) 7-00 AM తరువాత వీళ్లు ఇళ్లకు చేరాక - ట్రస్టు ఉద్యోగులూ, వెంకటాపురం పని మంతులూ తగులుకొని ఈ అవనిగడ్డ బాట పనులెందుకో?
11) చోద్యం కాకపోతే - ఏదో అందర్లా పదిరోజులు చేసి, పేపర్లలో ఫొటోలు పడగానే మానేయక – పదకొండు -పన్నెండేళ్ల నిర్విరామకృషి ఎందుకటా?
12) 2 గంటల దుమ్ము పనుల పిదప కాఫీల వేళ కార్యకర్తల ముఖాల్లో ఆ సంతోషమేమి ?స్వచ్ఛ కబుర్లేమి?
13) చివరగా ల్యాబ్ బత్తుల రవి ఎలుగెత్తి నినాదాల హోరు ఏమిటి?
14) రోజుటి వలెనే DRK గారి నేటి పనుల సమీక్షానంద మింతగానా?
రేపటి రహదారి పనులకై N. లంక రోడ్డులోని పబ్లిక్ టాయిలెట్ల వద్ద కలవాలనే గదా నిర్ణయము?
వయో గణనము ఇంచుమించుగ.
స్వచ్చ సుందర శ్రమల తాత్త్విక సంపదల కొక దశాబ్దిన్నర,
వీధి సొగసుల కొక దశాబ్దము, శ్మశాన వైభవమునకు తొమ్మిది,
చెట్ల కెనిమిది – తొమ్మిదేడులు, పూలవయసారేడు ఏడులు,
చుట్టు రహదార్లకేడేళ్ళూ, పసిమి మిసిమికి అర దశాబ్దము!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
08.01.2026