3709* వ రోజు .......           10-Jan-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

శనివారం (10-1-26) శ్రమ పండుగ! @3709*

               చల్లపల్లి-సామాజిక శ్రమదానమంటే చప్పగా జరిగే మ్రొక్కుబడి తంతు కాదనీ, పడమటి వీధి మస్తాన్ సోదరునితో సహా 45 మంది సృజనాత్మకంగా నిర్వహించే వీధి పండుగనీ ఇప్పటికే చాలా మార్లు ఋజువయింది!

               అలాకాకుండే ఈ వేకువ 4:20 కే 20 మంది పబ్లిక్ టాయిలెట్ల వద్ద కఠిన శ్రమకు ఉద్యుక్తులవుతారా? 6:24 దాక-2 గంటల పాటు

1) బండ్రేవుకోడు కాల్వ వంతెన ప్రాంతాన్ని,

2) SRYSP కళాశాలాంతర్గత వేడుక ప్రదేశాన్నీ కడిగిన ముత్యాల్లా మార్చేవారా?

               దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే సుకుమార కవి “ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ-పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ..!” అని పాట వ్రాసినట్లు ఇందరు గ్రామ ఉచిత సేవకులు కటిక చలిలో అవనిగడ్డ రోడ్డులోని మురికి కరిగించి, కలుపు తీసి, పూల మొక్కల్ని రక్షించి, రహదారి అందం కోసం శ్రమదానం చేయడాన్ని చూస్తుంటే-అసలిలాంటి సముచిత వీధి పని వేడుకలు 3709* రోజులుగా జరగడమంటే... ఈ కలికాలంలో ఎంత విశేషము?

               అదొక వందేళ్ల పురాతన SRYSP పాఠశాల! ఐదుగురు కార్యకర్తలు 2 ½  కిలోమీటర్లు వెళ్లి, మరో 3-4 రోజుల్లో ప్రాత విద్యార్థుల కలయిక కోసం 2 రోజులుగా ఆ బడి లోపల శుభ్రపరుస్తున్నారే!

               సరే-చేసే శ్రమదానమేదో చేస్తారనుకోండి, 6:30 తర్వాత చివరి ఫొటో వేళ ఈ అందర్లోనూ ఎంత సంతృప్తి! ఇలాంటి సామాజిక స్ఫూర్తిదాయక చర్యలు నరనరానా జీర్ణించుకొన్న DRK మహాశయుని సంతోషానికి ఆకాశమే హద్దు చూశారా?

               నేటి నినాదకర్త పద్మావతి ఆస్పత్రి సిబ్బంది పర్యవేక్షకురాలు లక్ష్మి.

               ఒక్క ట్రస్టు కార్మికసోదరుని నెల ఖర్చుకు బాధ్యత వహిస్తున్న రావి సాయి బిందు 10,000/- ట్రస్టు అకౌంట్ లో జమ, మరొక కార్మికుని కోసమై ఒక NRI సూర్యవర్థన్ తరపున 10,000/- చెక్కు సమర్పణ నల్లూరి శివకుమారిది!

               సందు దొరికితే చాలు – (5,000/-) చందా సమర్పించే ప్రాతూరి శాస్త్రి గారూ!   

               గత నెల స్వచ్చోద్యమ జమాఖర్చుల వివరణా, నేటి పనుల సమీక్షా DRK వైద్యునిది!

               కార్యకర్తలందరి నిర్ణయమూ రేపటి వేకువ వీధి సేవలు పడమటి వీధి-పాగోలు రోడ్డు కూడలి వద్ద అని!

           పర్యావణాప్త మిత్ర వర్యుడు!

మొక్కల మనసులు చదివిన తాతినేని రమణుడు

చల్లపల్లితో బాటుగ చాల ఊళ్లు హృద్యముగా

మార్చేస్తూ- స్వచ్యోద్యమ మందు చాల మొక్కలు

అందించిన పర్యావణాప్త మిత్ర వర్యుడు!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    10.01.2026