పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
ఆదివారపు (11-1-26) స్వచ్ఛ సుందరోద్యమం - @ 3710*
అది కూడ 59 వ నాడు సైతం మళ్లీ అవనిగడ్డ మార్గంలోని పాగోలు – అవనిగడ్డ రోడ్ల కూడలి వద్దనే. అసలు ఆదివారమంటేనే కార్యకర్తలు ఎక్కువ మంది చేరతారు, మూల మూలలు వెతికి రోడ్లు దుమ్ము దులిపేస్తారు, ఇక వాళ్ళకు హైదరాబాద్, విజయవాడల నుండి 27 ½ మంది చైతన్య పర్యాటకులు వచ్చి కలిస్తే?
అప్పుడిక మొత్తం వీధి శుభ్రకారుల సంఖ్య 62 కు చేరింది. ముందస్తు సంక్రాంతి వచ్చిందా – ఏ గ్రామ దేవతకో కొలుపులు జరుగుతున్నవా; అనేంతగా సందడి నెలకొంది.
ఈ సూర్యోదయానికల్లా శ్రమదానం రోడ్డు మలుపైన పోతురాజు గుడి దాక పోతుందనుకొన్నాను గాని, పాగోలు రోడ్డు వద్దే ఆగింది ! కారణాలివి;
1. బండ్రేవుకోడు గట్టు వద్ద మట్టి దిబ్బ చదును డజను మంది కార్యకర్తల శ్రమను మింగేసింది, మట్టినీ, 2-3 రకాల వ్యర్థాలనూ విడగొట్టడమూ, ఆ మట్టితో వంతెన ప్రక్క గండి పూడ్చడమూ,
2. పాగోలు వైపుగా మురుగు కాల్వ అంచుల గడ్డినీ, నానావిధ కశ్మలాలనూ తొలగించే పనీ,
3. పాగొలు మార్గం ఎదురుగా వడ్లమిల్లు ప్రాంతంలో ఊడ్పులూ, కలుపు ఏరివేతలూ, వీధి సుందరీకరణా
అసలీ వేళ విశేషము 2 రాష్ట్రాల నుండి 27 ½ మంది సామాజిక బాధ్యులు తమ వారం రోజుల పర్యటనలోభాగంగా చల్లపల్లి వేకువ శ్రమదాన సందర్శనమే! కార్యకర్తల శ్రమను వింతగా చూస్తూ, ఫోటోలు తీస్తూ, చీపుర్లో - గొర్రులో అందుకొని వీధిని శుభ్రపరస్తూ, “ఇలాంటి కార్యక్రమాలు కదా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఊళ్లకూ ఇప్పుడవసరం” అని చర్చించుకొంటూ, వాళ్లరాక నేటి శ్రమదానానికొక నిండుదనం తెచ్చింది!
Avg. రోడ్డుకు తూర్పు మిల్లు ఆవరణలో 6.40 కు మొదలైన సమీక్షాసభలో అటు అతిధుల, ఇటు కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి తీరాలి, సర్పంచి గారి నినాదాలూ, ఆస్థాన పాటగాని పద్యాలూ, నలుగురు అతిథుల ప్రసంగాలూ, ఇంకా వారిలో ఒకరి 1000/- చందా, ఆంధ్రజ్యోతి పద్మ గారి కవితా......
ఇవన్నీ చూస్తుంటే – ఇదసలు శ్రమదానమా లేక గ్రామ సామాజిక బాధ్యతల పండుగా” అనిపించింది!
రేపటి వీధి మెరుగుదల చర్యలు పాగోలు రోడ్డు నుండి పోతురాజు గుడి దిశగా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
11.01.2026
పలుగు పారలు, చీపురులతో
మీరు కదలివస్తుంటే
వీధులు ప్రణమిల్లుతాయి!
ఊరు ఉప్పొంగుతుంది!
బహిర్భూములను,
శ్మశానాలనూ
సుందరనందనాలుగా మార్చిన
స్వచ్ఛ సైనికులు మీరు,
చల్లపల్లి రహదారులపై
నిత్య స్వచ్ఛ సంతకాలు మీవి!
- పద్మ వడ్లమూడి, 11.01.26
(స్వచ్ఛ చల్లపల్లిని సందర్శించిన మెమరబుల్ టూర్ టీమ్ సభ్యురాలు)