పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
అవనిగడ్డ రహదారి శ్రమదానానికి షష్టి పూర్తి @ 3711*
షష్టి పూర్తి నిర్వాహకులు ఈ సోమవారం (12-1-26) హాజరైన 31 మంది స్వచ్చ కార్యకర్తలు ; సమయం వేకువ 4-20-6.20 మధ్యస్తం; స్థలం ; పాగోలు బాట దగ్గరి స్వచ్ఛ టాయిలెట్లు !
ఈ ఉత్సవం మంత్రోచ్చరణలు, మంగళ సూత్ర ధారణలూ వంటివికాక, మనం బైట చూసే మేళ తాళాలూ కాక కొన్ని ఆన వాయితీల ప్రకారం జరుగుతుందన్నమాట! నాగాయలంక రహదారికి నేడు జరిగిన 60 రోజుల వేడుక 31 మంది స్వచ్ఛ కార్యకర్తల శ్రమ పూర్వక రహదారి పూజ! చల్లపల్లి చుట్టూ గల ఏడు – ఎనిమిది- తొమ్మిది రహదారులకూ షష్టి కాకున్నా - 30-40 రోజుల శ్రమ సమర్పణలు జరుగుతూనే ఉంటాయి!
బండ్రేవు కోడు కాల్వ దక్షిణపు గట్టు కూడలి వద్ద శ్రమ సమర్పణ గావించిన ఆరేడుగురిది బాగా బరువు పనిగా చెప్పాలి. కోడి – మేక- చేపల మాంస వ్యర్థాల పారబోత అక్కడి దుర్వాసనకు కారణమేమో!
ప్రస్తుతానికా మట్టిదిబ్బ చదునై, అదనపు మృత్తిక వంతెన పడమటి పల్లాల్లో అమరి, ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉన్నది.
వీధుల మురికి జాడ్యాన్ని, రహదార్ల అంచుల మన్నికను, గుంటలను పట్టించుకొనే స్వచ్చ సైనికులు అచ్చటి ఉద్యానాల్ని ఆకులేరి, ఊడ్చి, ప్లాస్టిక్ రహితంగా చేయకుండరు గదా! బ్రహ్మంగారి గుడీ-టాయిలెట్ల మధ్య వనం ఇంత అందంగా తయారవడానికి 10 మంది వాలంటీర్ల చెమటలు గంట పాటు చిందడమే!
ఈ వీధి ఊడ్పులు, రోడ్డు భద్రతా బాధ్యతలు, కలుపు తీతలు, గ్రామ సౌందర్య సాధనలు ఊరికే పోవు - ఎప్పటికైనా గ్రామంలో ప్రతి వార్డు నుండి డజన్ల కొద్ది స్వచ్ఛ సుందరీకులు పుట్టు కొచ్చి, తమ తమ వార్డుల్ని ఒక కమ్యూనిష్టు వీధి లా, గంగులవారి పాలెం మార్గంలా చేసుకోకపోతారా అనేది ఈ స్వచ్చోద్యమకారుల కల!
ఇంత అందమైన రహదారిలో కాసానగరం వద్ద ఒకరి కర్మకాండల వల్ల తయారైన నానా కశ్మలాలు నిన్న పడి ఉండటం ఒక అపశ్రుతి!
బెజవాడలో కంటి శస్త్ర చికిత్స జరిగిన 36 గంటల్లో ఒక డాక్టరమ్మ స్వచ్ఛసేవలకు రావడం ఒక పట్టుదల! ఆమె నినాదాలతో మొదలైన సమీక్షా సభలో : 2 కిలోమీటర్ల AVG రహదారి అందానికీ, దాన్ని సాధించిన కార్యకర్తలకూ ప్రశంస!
రేపటి వేకువ పనులకై గంగులవారి పాలెం బాటలో కలవాలని నిర్ణయం!
మస్తిష్కంలో మెదలును
వేముల – షణ్ముఖ శ్రీనొక వెరయిటీ కార్యకర్త
ఏ పనిలో దిగినా తన ఏకాగ్రత చూపెట్టును
క్రొత్త క్రొత్తసేవలతని మస్తిష్కంలో మెదలును
అతనికి తల్లే దైవం అని కూడా చెప్పగలను!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
12.01.2026