పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
గ్రామ సామాజిక సేవా పూర్వకంగానే భోగి వేడుకలు-@3713*
అవి జనవరి 14, 2026న (బుధవారం) 4.16 – 7.40 నడుమ సన్‌ఫ్లవర్ వీధి లోని కడియాల వారి గృహ సముదాయం వద్ద జరిగాయి. శ్రమదాన నియమ నిబద్దులు పాతిక ముప్పై మంది ముప్పావు గంటకు పైగా వీధి శుభ్రతకు ప్రయత్నించాక –
నెమ్మదిగా భోగి వేడుకలు రాజుకొన్నాయి. అటు మంచు ముసురూ, ఇటు పండుగ సందడీ పోటీ పడి, సందడి భాగస్వాములు 80 మంది కావడంతో మంచూ చలీ ఓడిపోయి, భోగి మంటల వెలుగులో
- స్త్రైణ కైవార మృదు నాట్య భంగిమలూ,
- పిల్లల కేరింతలూ,
- పురుషుల అసంకల్పిత చిందులూ,
- పిల్లలకు భోగి పళ్ళ ముచ్చటలూ,
-కార్యకర్తల మీద నందేటి శ్రీను “ ఎక్కడో పుట్టి – ఎక్కడో పెరిగి ...” సరదా పాటలూ,
- ‘మనకోసం మనం’ ట్రస్టు సభ్యురాలైన దాసరి స్నేహ ననుసరించి 80 మంది స్వచ్చ సుందరోద్యమ నినాదాలూ,
- ఛాయా, దృశ్య శ్రవణ చిత్రాలూ,... అలా సాగింది 6.45 దాక!
ఇక అప్పుడు మొదలయింది-కడియాల రామారావు – భారతి – సురేష్ ల ఆతిథ్యం – రకరకాల వంటకాలతో – రుచులతో!
ఈ విందుకు ముందే-
- కాకినాడ నుండి వచ్చి చల్లపల్లిలో స్థిరపడిన కాకుమాని రామకృష్ణ - లక్ష్మిగార్ల 10,000/- చందా,
- దొప్పలపూడి హవీష్ చౌదరి నుండి 500/- సహకారమూ DRK గారు అందుకున్నారు!
NTR పాటకు తూము వారి అభినయం అదిరింది.
నేటి కార్యక్రమం పట్ల DRK వైద్యుల వారు సంతృప్తి చెంది,
రేపటి శ్రమకు పడమటి వీధిలోని పోతురాజు గుడి వద్ద కలవాలని సూచించారు.
బహుశా దేశంలో ఎక్కడా ఉండని క్రొత్త పంధాలో జరిగిన ఈ భోగి పండుగ ఏమి సందేశమిస్తున్నది?
- కొందరు సమాజానికి అతీతులమనుకొంటారు గాని, సమాజంలో కలగలిసే అందరి బ్రతుకులూ సవ్యంగా సాగాలనా?
- పండుగ సంబరాలైనా సరే- గ్రామ బాధ్యతలను మరువరాదనా?
- ఎవరికి వారు జరుపుకొనే పండుగ కన్నా ఇలాంటి సాముహిక ఉత్సవాలు మరింత ఉత్తేజాన్నిస్తాయనా?
జయప్రదమగును!
వేదశాస్త్రములు చదువకపోయిన జీవనాదములు గ్రహించుచుందురు!
తోటి ప్రజల సౌఖ్యంలోనే తమ దొడ్డ సుఖములను పసిగడుతుందురు!
శ్రమ స్వేదంలో ఊరుతో బాటు తమ ఆరోగ్యం ఉండుననుకొనే
స్వచ్చ సుందర కార్యకర్తల శుభ సంకల్పము జయప్రదమగును!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
14.01.2026