3717* వ రోజు ......           18-Jan-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

మరొక ఆదివారపు (18.1.26) శ్రమజీవన సౌందర్యం - @3717*

               ఇది కూడా నాగాయలంక బాటలోని పడమటి బజారులోని - వాసు టీ దుకాణం వద్ద నుండే మొదలై, కోట ప్రధాన ద్వారం దాక సాగిన శ్రమదానమే ! శ్రమదాతలు ముప్పై నలుగురే!

               ఏ మాత్రం వెనక్కు తగ్గనిది చలీ+మంచే! ఐనా సరే – విసుగు చెందని విక్రమార్కులు వీధి కాలుష్య శవాన్ని భుజాలకెత్తుకొని, పర్యావరణ మెరుగుదల బాటలో ప్రయాణిస్తుంటే - సదరు శవంలోని భేతాళుడు -

               “ఓరి అమాయక గ్రామోద్ధారక కార్యకర్తలనబడే విక్రమార్కులారా! 12 ఏళ్లుగా మీ పట్టుదలను చూస్తుంటే - నాకు జాలి వేస్తున్నది; చరిత్రలో అపూర్వమైన మీ స్వచ్ఛ సుందరోద్యమాన్ని గమనించిన సగం గ్రామస్తులు - ‘ఫర్వా లేదే - ఈ ఆడా - మగా విక్రమార్కులు వట్టికబుర్లు కాక - ఒక సామాజిక సదాచరణ పూర్వకంగా - ఆదర్శవంతమైన గొప్ప బాధ్యత నెరవేరుస్తున్నారే” - అని మెచ్చుతున్నారు గాని -

               పాతిక వేలమందిలో - 18 వార్డుల్లోని 5 వేల ఇళ్లనుండి 1% మందైనా వచ్చి మీతో కలుస్తున్నారా?

               “ఈ వేకువ మీరు రహదారి భద్రతా, వీధి శుభ్రతా సాధన కోసం 150 గజాల బజారులో ఊడుస్తుంటే, భోగి మంటల అవశేష వ్యర్ధాలను ఎత్తుతుంటే – 4:15 నుండి 6:20 దాక - 2 గంటలు ఆ ప్రాంత సౌందర్యం కోసం తపిస్తుంటే - ఇద్దరు తప్ప స్థానికులైనా వచ్చి సహకరించారా చెప్పండి?

               ..... ఇలా భేతాళుడి ప్రశ్నల పరంపరకు స్వచ్ఛ సుందర విక్రమార్కులు ఇట్లు బదులిచ్చారు:

“భేతాళా! కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు;

12 ఏళ్ళనాడున్నట్లు చల్లపల్లి ఇప్పుడులేదే,

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ఊరు లోని మార్పును గుర్తించి,

ఒక ఆదర్శ గ్రామంగా పేర్కొంటున్నాయే,

మేం ఇలా సహనంతో పట్టుదలతో ప్రయతిస్తే మరో 2-3 ఏళ్లలో సంపూర్ణ స్వచ్ఛ - సుందర -శ్రమ సంస్కృతీ వైభవ - అభ్యుదయ చల్లపల్లిని సాధించగలమనే నమ్మకం మాకున్నది.

               “మేము రేపటి వేకువ కూడ ఇదే వీధిలో RTC బస్ ప్రాంగణం నుండి మా కార్యక్రమం ప్రారంభిస్తాం,

               “ఈ మధ్యాహ్నం 12:00 కు వైశ్య బజారులోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జరిగే మా స్వచ్చోద్యమ మిత్రుడు ఉడత్తు రామారావు గారిని సంస్మరిస్తాం,

               “ఇదుగో నేటి మా సమీక్ష సభలో నూతక్కి శివబాబు ఉద్యమ నినాదాలకు ప్రతిస్పందిస్తాం!

               ఇప్పటికిక సెలవు!” అని గట్టిగా బదులిచ్చారు.

            చప్పగ అనిపిస్తుండును!

 ఇడుగో నందేటి శ్రీను - ఇతడే పాటల శ్రీనుడు

 హేతుబద్ధ గానానికి ఎన్నిమార్లు తన గొంతుక

అరువిచ్చెనొ చెప్పలేను - అతని పాట లేని నాడు

 స్వచ్ఛ సుందరోద్యమమే చప్పగ అనిపిస్తుండును!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    18.01.2026