పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
19-1-26 (సోమవారం) నాటి పని దిన సంఖ్య – 3718*
ఈ వేకువ 4.18-6.17 నడుమ RTC. సంస్థ ప్రాంగణ ప్రాంతమున వీధి శుభ్ర - సందర్భములకై శ్రమించిన కార్యకర్తలైతే 23 మందే. బస్ స్టాండు ప్రవేశమార్గంలో ఒక్క చీపురు వాలా కొంతసేపు ఊడ్చాడు గాని, మిగిలిన అందరికీ అటు నుండి పడమర అవనిగడ్డ బాటలోనే సరిపోయింది.
కోట గుమ్మం వద్దే 7 గురు గడ్డి కోసే - నేలను సమం చేసే – వ్యర్ధాలను ఏరే పనుల్లో లీనమయ్యారు. ఆ క్రమంలోనే ఒక పడిపోయిన బండిని ప్రక్కకు జరపారు కూడ!
వీధి దక్షిణ భాగం 60 గజాలు కూడ 10 మందికి గడ్డి చెక్కుడుకూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్కుల ఏరుడుకూ, ఊడుపుకూ అవకాశమిచ్చింది. అయ్యో! గృహిణులు ఇళ్ల ఎదుట, దుకాణాల ఎదుట ఊడ్చి, ముగ్గులు పెట్టారు గాని, మూరెడెత్తు గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ, వాటి నడుమ ప్లాస్టిక్ వ్యర్ధాల్ని ఎందుకు ఉపేక్షిస్తారో తెలియదు!
కట్టె పేళ్ల అడితీల వారు మరీ రోడ్డు మీది దాక గుట్టలేల పేర్చవలెనో అర్థం కాదు! వాళ్ల లోగిళ్ల ముందు, దుకాణాల ఎదుట కార్యకర్తలంతగా శ్రమిస్తుంటే - అస్సలు పట్టించుకోక, తలుపులు తెరవని గృహస్తులూ, దుకాణదారులూ అదృష్టవంతులు; చూస్తూ సిగ్గుపడని - మొహమాటపడని వారి ధైర్యం గొప్పది!
ఇందరు ఊడ్చిన ఇసుకా దుమ్మూ చక్కగా డిప్పల కొద్దీ ట్రాక్టరు సగం నిండి, ఎక్కడికి చేరి, తారు రోడ్డు రక్షణగా అమరాలో ఆ ఊరి వెలుపలికి చేరింది. తుక్కు గుట్టలు మాత్రం పంచాయతి ట్రాక్టరు కోసం ఎదురు చూస్తున్నవి!
ఈ ఉదయం కూడ శాస్త్రి (హిందీ) మాస్టారు రానందున, వారి డ్యూటీని తూము వారు పూర్తి చేయగా, వారి శ్రీమతి ఇందిర నినాదాలందుకొనగా,
M.P. శ్రీమద్విజయేంద్ర ప్రసాదు గారి 50 లక్షల విరాళ సద్వినియోగాన్ని Dr. డి.ఆర్.కె గారు ప్రస్తావించి,
రేపటి మన గ్రామ బాధ్యతకై RTC బస్ ప్రాంగణంలో కలవాలని సూచించారు!
వణుకు పుట్ట వలసిందే !
వక్కలగడ్డ రామ కృష్ణ వచ్చాడంటే చాలును
వీధిలో కాలుష్యాలకు, పిచ్చి కంప, కలుపులకూ
వణుకు పుట్ట వలసిందే ! బరువగు పనులున్న చోట
ఆతడు ప్రత్యక్షమగును – ఆ పనులను చక్కబెట్టు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
19.01.2026