3719* వ రోజు ......           20-Jan-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

బస్ ప్రాంగణ శుభ్ర సుందరీకరణం - @3719*

               ఆ పుణ్యకార్యం మంగళవారం (20.1.26) వేకువ 4. 20 కే మొదలై 6.22 దాక జరిగి, కార్యకర్తల అంచనాలో 80% విజయవంతమయ్యెను.

               నిన్నటి పని ముగింపు వేళ కొందరు కార్యకర్తలు “రేపు మెయిన్ రోడ్డుకు బదులు బస్టాండులో శుభ్రపరిస్తే బాగుంటుంది కదా, ఒక్క రోజులో ఈ RTC బస్ నిలయం కళకళలాడుతుంది....” అనుకొంటుంటే విన్నాను; అంత పెద్ద బస్ స్టాండును కేవలం 30 మందే ఒకే రోజులో ఎలా సుందరీకరిస్తారో’ అని సంశయించాను.

               తీరా ఈ పూట 30 మంది సుమారు 50 పని గంటల్లో చేసి చూపిస్తే ఆశ్చర్యపోయాను! 2 మినీ ఉద్యానాలనూ, 2 పెద్ద గార్డెన్స్ నూ, ప్రవేశద్వారం నుండి వాహన నిష్క్రమణ ద్వారం దాకా ఊడ్చి, వ్యర్థాలను ఏరి, “రోడ్డు గుంటల్ని కూడ కొంత సరిజేయడమంటే మాటలా? మరి, ఈ మ్యాజిక్ ఎలా జరిగింది?

               మాయలూ, మంత్రాలతో కానే గాదు, వందల మంది ప్రయాణికుల్లో కొందరు వచ్చి కృషి చేయనూ లేదు, కేవలం మానవ శ్రమతోనే సాధ్యపడింది. కాకపోతే సదరు శ్రామికులు అల్లాటప్పాలు కాదు, 12 ఏళ్ళ నుండీ పబ్లిక్ స్థలాల్ని ఎలా బాగుచేయాలో - వేల కొద్దీ నీడ, పూల చెట్లనెలా నాటి, నిర్వహించాలో - ఆ 30 మంది సమూహం విభజితమై, నాలుగు చోట్ల – నాలుగు రకాల పనుల్ని ఎలా సమన్వయించుకోవాలో తెలిసిన అనుభవజ్ఞులు!

               ఎక్కడా తడబడరు, బరువు పనులకు వెనకాడరు, అన్నీ ప్రణాళికాబద్ధంగా చేసుకుపోతారు కాబట్టే - ఇంత పెద్ద గ్రామ పరిశుభ్ర – సౌందర్యాలను నిలబెట్ట గలుగుతున్నారు!

నేటి తుది సమావేశ విశేషాలివి :

1) పచ్చిమిర్చిని సహ కార్యకర్తలకు పంచిన లంకె సుభాషిణి నినాదాలిచ్చుట,

2) కార్యకర్తల పనితనాన్నీ, స్వార్థరాహిత్యాన్నీ DRK గారు ప్రశంసించుట,

3) రేపటి వేకువ ఇదే బస్టాండులోనే ఆగి, మిగిలిన కొద్దిపాటి పనుల్నీ, సమయం మిగిలితే బాహ్య రహదారినీ శుభ్రపరచుట.

                చల్లపల్లి నవ చరిత్ర

సన్ షైన్ గురవారెడ్డికి చాలకనా వైద్య సేవ?

ఊరుకాని ఊరు కొరకు ఉవ్వెత్తున బాధ్యతలా?

పలుకుబడిని “మనకోసం మన” సంస్థకు వెచ్చించుట

చల్లపల్లి నవ చరిత్ర చక్కగా లిఖించుటకా?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    20.01.2026