3720* వ రోజు ......           21-Jan-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

బస్టాండు దక్షిణ ఖాళీ భాగంలో కూడా.... @3720*

               బుధవారం వేకువ (21.1.2026)  సమయపు – 4.15 – 6.20  మధ్య సైతం స్వచ్చ కార్యకర్తల ప్రవర్తన ఎప్పటిలాగే!  32 మంది సేవల్ని అప్పనంగా పొందిన RTC ముఖ్య ప్రాంగణంతో బాటు పూర్వకాలపు మరుగు దొడ్లూఎవరో లీజుకు తీసుకొన్న దక్షిణ భాగమూ కాలుష్యాలను కోల్పోయి పరిశుభ్ర సుందరంగా విరాజిల్లుతున్నవి!

  లీజు దారుడు గాని, సంస్థ యాజమాన్యం గాని, ఆఖరికి వేచి యున్న ప్రయాణీకుల నుండి గానీ ఆ 2 గంటల స్రమదానంలో పాల్గొన్నారా ? ఒకానొక చారిత్రాత్మక సామాజిక శ్రమ సంస్కృతిని హర్షించారా? ఆ ఎప్పటి కార్యకర్తలే! చిత్తు కాగితాల మీద - మధ్యం బాటిళ్ల మీద-ప్లాస్టిక్ వ్యర్థాల మీద వాళ్ల యుద్ధమే ఈ వేకువ కూడ పునరావృతమైనది!

పెదకళ్ళేపల్లి రోడ్డు వైపున్న గలీజులు తొలిగి, నిన్నటి శుభ్ర పడిన రోడ్డే మరింత ఆహ్లాదకరంగా మారి, వ్యర్థాలతో మళ్లీ ట్రాక్టరు నిండి, ముళ్ళ మొక్కలూ, మొండి పిచ్చి చెట్ల మొదళ్లూ అదృశ్యమై, 2 ఉద్యానాల అంతర్భాగాలు ఎండుటాకులు, కాగితమ్ముకులు కనిపించక ఇప్పుడు బస్ ప్రాంగణమెంత హాయి గొల్పుతున్నదో!

12 ఏళ్లుగా ఈ స్వచ్ఛ, కార్యకర్తల భగీరథ ప్రయాత్నానికి చేయూత నిచ్చిన దాతలూప్రోత్సహించిన మీడియా మిత్రులూ ధన్యులు! ఇంకా ఇప్పటికీ మా గొడవలు మాకు చాలక – శ్రమదానంలో పాల్గొనాలా? అని దూర దూరంగా ఉంటున్న గ్రామస్తులకు వందనం!

శ్రీ శ్రీ వర్ణించిన శ్రమైక జీవన సౌందర్యాన్ని 3721* నాళ్లుగా సజీవంగా నిలుపుతున్న కష్టజీవులకు అభివందనం!

నేటి శ్రమదానోద్యమ ప్రతిజ్ఞలు చేసిన భరత్ గారూ, తను ఆదా చేసిన 20/- ను ఉద్యమ చందాగా మార్చిన పల్నాటి అన్నపూర్ణకూ జోతలు!

గురువారం నాటి శ్రమదానం కోసం RTC బస్ స్టాండు ఎదుట కలుద్దాం!

     ఆనంద వీచికలె అడుగడుగునా

ఎవ్వరడిగేరమ్మ ఈ వీధినీ

         క్రిక్కిరిసి వేలాది పూలిమ్మనీ

ఎంత తహతహలే ఈ బాటకూ

ప్రజలకాహ్లాదమును పంచేందుకూ

                 ||ఎవ్వరడిగేరమ్మ ఈ వీధినీ 

                క్రిక్కిరిసి వేలాది పూలిమ్మనీ||

జన్మదిన వేడుకలు, సెల్ఫీ ల సరదాలు

        ఆనంద వీచికలె అడుగడుగునా

ఎవరి దార్శనికతో ఈ సొగసులో ?

        ఎంత శ్రమ దాగెనో ఈ తోటలో ?

              ||ఎవ్వరడిగేరమ్మ ఈ వీధినీ

              క్రిక్కిరిసి వేలాది పూలిమ్మనీ||

బంతి పూ గుచ్చములు ప్రతి అడుగులో

     ఈ బాటె మేల్బంతి మన ఊరిలో

ఇకపైన రోడ్లన్ని మన ఊరిలో

        ఇట్లు మారుటె గదా మన స్వప్నమూ!

||ఎవ్వరడిగేరమ్మ ఈ వీధినీ – క్రిక్కిరిసి లక్షలుగ పూలిమ్మనీ||

||ఎంత తహతహలే ఈ బాటకూ ప్రజలకాహ్లాదమును పంచేందుకూ||

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    21.01.2026