3721* వ రోజు .. ....           22-Jan-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

ఇప్పుడు ఇదొక సంపూర్ణ స్పచ్ఛ- శుభ్ర – సుందర బస్ ప్రాంగణం @ 3721*

ఈ గురువారం (22-1-26) కూడా అదే RTC బస్ ఆవరణంలోనూ, కుడి-ఎడమ-మధ్య- ద్వారాలలోనే 34 మంది రకరకాల ప్రయత్నాలు! అందులో కొందరివైతే ప్రవేశ ద్వారం వద్ద ఘాటు కంపుకొట్టే మినీ డంపింగు తొలగింపు పనులు! అక్కడ సీసాల - గ్లాసుల - ప్లాస్టిక్ దరిద్రాల వద్ద ముప్పావు గంట పని చేసిన ఏడెనమండుగురి మొండి ధైర్యానికి జోహార్లు!

అలాగే శుభ్రంగా కనిపిస్తున్నా సరే - సైకిల్ స్టాండును మరొక పర్యాయం వెతకి వెతకి కాలుష్యాల పని బట్టిన నలుగురూ పాదాభివందనార్హులే!

చెట్ల ఎండు మట్టల్ని రాల్చి, 2 పల్లాలను సరిజేసి, క్రొత్త హోటల్ వెనుక భాగాన్ని తీర్చిదిద్దిన కాకలు తీరిన 10 మంది కార్యకర్తల కృషీ తక్కువదేంకాదు.

చదువరులకు వీలు చిక్కితే పెను వేప చెట్టు క్రింద నిన్నా-ఈ పూటా కార్యకర్తలు సేకరించిన ఆరేడు గోతాల గాజు - ప్లాస్టిక్ వస్తువుల ఫొటోల్ని చూడాలి!

out gate ప్రక్కన మినీ ఉద్యానంలో దూరి, పెదకళ్లేపల్లి రోడ్డు వైపు డ్రైను దాక శుభ్రపరచిన తెగువనూ అంచనా వేయండి!

స్వయంగా చూడక ఫొటోల్లో నేటి శ్రమదానం చూస్తే “ ఏముందిలే - ఏదో బస్టాండు ఊడ్చారు- కాగితాలేరారు- ట్రాక్టర్లోకి ఎక్కించారు - అంతేగా” అనిపించవచ్చు - వివరంగా కాక టూకీగా చెప్పే నా మాటల్లో వాట్సప్ పాఠకులకు 50% మాత్రమే అవగాహన కుదరవచ్చు ! గ్రామస్తులు స్వయంగా చూసి, పాల్గొన్నప్పుడే ఈ శ్రమదానోద్యమమేమిటో బోధపడుతుంది!

నిన్న ఒక డిగ్రీకళాశాల విద్యార్థులు చల్లపల్లిలో జరుగుతున్న శ్రమదానం మాకు తెలియనే తెలియదు అన్నారని చెప్పిన DRK గారి మాటలతో కార్యకర్తలు ఖంగుతిన్నారు. 2 కళాశాలల విద్యార్థులు శ్రమదానానికి వస్తున్నారని తెలిసి, సంతోషించారు.

రేపటి వీధి సేవలు బస్టాండు వద్ద గల పంచముఖ ఆంజనేయ గుడి వద్ద నుండి జరుగుతాయట!

              వెర్రి కొంచెం ముదిరిపోయెన?

టైలరింగ్ పని చాల లేద ? కుటుంబ బాధ్యత తీర్చుకోవా?

సొంత స్వస్తత చూసుకొనవా? ఊరి బాధ్యత వదల లేవా

అన్ని వదలీ వీధి సేవల కంతగా పరుగెత్త వలెనా?

వెర్రి కొంచెం ముదిరిపోయెన? వెంకటేశ్వర నామధేయా !

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    22.01.2026