3723* వ రోజు .......           24-Jan-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

శనివారం (24-1-26) నాడు పెరిగిన స్వచ్ఛ కార్యకర్తల సంఖ్యా బలం - @ 3723*

               ఆ సంఖ్య 46, అందులో 17 మందైతే మరీ 4:14 కే హాజరు! ఆగినది నాగాయలంక రోడ్డులోని కరీముల్లా డ్రసెస్ వద్ద, పని చేసింది RTC బస్ స్టాండు మూల నుండి బెజవాడ -బందరు రోడ్ల దాకా!

               ప్రధానంగా తొలగిపోయినవి దుమ్మూ – ఇసుకా మిశ్రాలు, బంక్ వద్ద మినీ ఉద్యాన వ్యర్ధాలు, దుకాణాల ఎదుటి కొద్దిపాటి కాగితాలు – చిల్ల పెంకులు.

               అసలే శుభ్రంగా - అందంగా ఉన్న ఆ 200 గజాల వీధికి తెల్లారేపాటికి కార్యకర్తల శ్రమ పుణ్యమా అని సమకూరినది మరింత స్వచ్ఛ - శుభ్ర శోభ!

               వీధి శోభకు కష్టం 46 మందిదైతే - కేవలం ప్రేక్షక పాత్ర పోషించినది అందుకు 3 రెట్లు! శుభ్రం చేసిన వీధిలో RTC బస్సుల నుండి టీ లు సేవించిన వాళ్లు విసరిన గ్లాసులూ – విసుక్కొనక 6.00 తర్వాత కూడ మళ్ళీ ఏరినది స్వచ్ఛ కార్యకర్తల అంతులేని సహనం!

               పోస్టాఫీసు రోడ్డులో ఊడుస్తున్న ముగ్గురికి - తూము, రాజు, మరొకరు డ్రైన్నుండి ఘాటు వాసన తగలగా, దంతె-పార-పలుగుల్తో అరగంటకు పైగా బరువైన కప్పు పలకలు లేపి, అడ్డుపడిన సిల్టు, రాళ్లు రప్పల్ని బైటకు లాగి, నిలవ మురుగు నీటికి పరుగునేర్పిగాని విశ్రమించ లేదు. సదరు తూము వద్ద తూము-తదితర కార్యకర్తల త్రయాన్ని ఫొటోలో గుర్తించండి.

               “మన ఊరి వీధుల్ని, హోటళ్ల ఎదుటి భాగాల్ని, గుడుల్ని, దుకాణ సముదాయాన్ని మనం అడగకున్నా - పాల్గొనకున్నా ఇందరు వాలంటీర్లు - ఇన్నేళ్లుగా ఎందుకింత శుభ్రంగా - అందంగా తయారుచేస్తున్నారా” అని ఆరా తీయండి!

               “మనలో కొందరు దుష్టులు కార్యకర్తలు నాటి పెంచిన 30 వేలకుపైగా చెట్లలో కొన్నిటిని ఎందుకు నరికేస్తారో, పీక్కెళతారో, తగలబెడతారో పట్టించుకోండి!

               పంచాయతీ సెక్రటరీ గారు నినాదాలు పలికి, “ఇతర గ్రామాల వారికి వ్యర్థాల నిర్వహణ మీద చల్లపల్లిలో ట్రైనింగు జరుగుతున్నదని చెప్పిన సంగతి గుర్తుంచుకొనండి!

               రేపటి మన వీధి పారిశుద్ధ్యం SBI ప్రాంతంలోనని మరువకండి!

               ఆమె డాక్టర – గ్రామ సేవిక?

తనదు సున్నిత వ్రేళ్లే కత్తెర దాల్చి శస్త్రచికిత్స చేయును,

కరకు కత్తులు పట్టి, కలుపులు కోయు చుండును, ప్రోగు చేయును,

అవసరానికి ట్రాక్ట రెక్కి ఆమె పదములె చెత్త త్రొక్కును

ఆమె డాక్టర – గ్రామ సేవిక? అర్థమైతే నాకు తెలుపుడు !

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    24.01.2026