3724* వ రోజు .......           25-Jan-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

శ్రమదానం సంగతికొస్తే – ఎట్లైనా ఆదివారం (25.1-26) ఆదివారమే @ 3724*

లేకపోతే - నిన్నటి కార్యకర్తలు 45 మందైతే, నేటి గ్రామ సామాజిక కర్తవ్య పరాయణులు 53+11 మందా? (+ తరువాతి వారు దాతలూ, అతిథి కార్యకర్తలూ!) పని జరిగిన కాలం వేకువ 4.15 - 6.16 మధ్య 70 కి పైగా పని గంటలు! సేవలందుకొన్న వీధి 6 వ నంబరు కాలువ నుండి రిలయన్స్ మాల్ రోడ్డు దాక.

నేటి వీధి పారిశుద్ధ్య చర్యల విశేషాలివి:

•     గ్రామ వ్యర్థ నిర్వహణకు ఇతర గ్రామాల పంచాయతీల వారు ట్రైనింగ్ కు వచ్చి, వారిలో కొందరు పని స్థలానికి వచ్చి, ఇంత పెద్ద సామూహిక - సామాజిక శ్రమదానాన్ని చూసి, ఆశ్చర్యపడడం,

•    గ్రామ సర్పంచి దంపతులు సరే - సజ్జా వారి వీధి నుండి క్రొత్తగా ఒక యువ పశు వైద్యుడు డా.రవీంద్ర గారు వచ్చి పారతోమట్టి పనికి దిగడం,

•   “ఇంత మంచిగా కనిపించే వీధి అందాలలోనూ ఇంకా ఇన్ని లోపాలున్నవా, ఊడిస్తే ఇంత దుమ్ము, ఇసుక, ఎర్రమట్టి దొరికిందా?” అనిపించడమూ,

•   ఆదివారమన్నా సెలవు తీసుకోక అర్థ శత స్వచ్చ కార్యకర్తలు ప్రజాహ్లాదం

కోసం ఉద్యానాల్లో, వీధి మార్జిన్లలో, పళ్ళ, టిఫిన్ బళ్ళ ప్రాంతాల్ని సుందరీకరించడం.

దుమ్మూ-ఇసుకా వదిలించుకొని, ఉద్యాన పిచ్చి మొక్కలూ, కలుపూ తప్పుకొని, ట్రాన్సాఫార్మర్ల లోతట్టూ శుభ్రపడి, అర కిలోమీటరు వీధి ఇప్పుడెంత అందంగా కనిపిస్తున్నదో చూశారా?

మరి మీ దృష్టిలో ఇలాంటి కార్యకర్తలు దొరికిన ఊరిదా, సామాజిక ఋణం తీర్చుకొనే అవకాశం దొరికిన కార్యకర్తలదా - ఎవరిది అదృష్టం?

శ్రమదానోద్యమ నినాదాలు పలికి, తోటి కార్యకర్తల్ని అభినందిస్తున్న సర్పంచి

గారి మాటలు విన్నారా?

గ్రామాభ్యుదయ కాంక్షతో మనకోసం మన ట్రస్టీ గారికి ఆర్థికంగా :

1.          కాకరపర్తి సురేశ్ గారి 10,000/-,

2.   కూరపాటి  కోటేశ్వరరావు గారి చిన్నారి మనుమళ్లు గౌరం మోక్షిత్ శ్రీ నాగ పోతురాజు మరియు శ్రీ చెన్న కేశవ 10,000/-,

3.    దివంగత తండ్రి గారి పేర ఉడత్తు రామారావు గారి కుమారులు ఉడత్తు వెంకటేశ్వర రావు గారు మరియు రామ్ గోపాల్ మరియు నళినీ కుమార్ గార్లు  25,000/- సహకారాల్ని గమనించారా?

కోటేశ్వరరావు గారి అల్పాహార విందూ, అందులో ఒక ఐటమ్ ను ఇమ్మాన్యుయేల్ హోటల్ యజమాని వేమ నాగేంద్ర బాబు గారి సమర్పణ కార్యక్రమాలు... ముగిసింది 6.55కు.

రేపటి కళ్ళేపల్లి బాట శుభ్రత కోసం సాగర్ ఆక్వా ఫీడ్స్ వద్ద గల 216 హైవే జంక్షన్ వద్ద కలుద్దాం!

                    అది న్యాయమ – అది ధర్మమ?-1

జరుగునది మన ఊరికని, నెరవేరితే అందరికి మేలని,

బాటలూడ్చే – చెట్లు పెంచే పనులనింత ఆశ్రద్ద చేస్తే

అప్పుడపుడాటంక పరిచీ, కార్యకర్తల కడ్డువస్తే

అది న్యాయమ – అది ధర్మమ – అది క్షేమమ – అది సౌఖ్యమ?

 

- నల్లూరి రామారావు

ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

25.01.2026