3725* వ రోజు .......           26-Jan-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

27 గురితో శివరాంపురం బాట సుందరీకరణ! - @3725*

               ఈ సోమవారం (26.1.26) వేకువ శ్రమదానం ఊరికి దూరంగా మారటం వల్లనేమో - నిన్నటి కార్యకర్తల 53 సంఖ్య సగానికి కుదించబడింది. ఐనా సరే - రానున్నది మహాశివరాత్రి ఈ పెదకళ్ళేపల్లి మార్గం ఆ రెండు నాళ్ల పండుగ కోసం లోపరహితంగా ముస్తాబు కావలెను గనుక - అది దశాబ్దకాలపు ఆనవాయితీ గనుక – చలిగాలో, మంచో – పనిచోట విద్యుద్దీపాలున్నా లేకున్నా స్వచ్ఛ కార్యకర్తలు తమ బాధ్యత మానరు గదా!

               అందువల్ల రెండో, మూడో కిలోమీటర్లు ప్రయాణించి, 4.16 కే సాగర్ ఆక్వా పరిశ్రమ వద్దకు చేరుకొని, ఖచ్చితంగా 2 గంటలు తమ ఊరి మంచి కోసం కృషి చేశారు! 2 రహదార్ల కూడలీ, శివరాంపురం దిశగా 100 గజాలూ తమ ఇష్టానుసారం శుభ్ర-సుందరీకరించక మానలేదు!

               ఒక్క సారి కమిట్ ఐయ్యాక – అది లోతైన డ్రైను కావచ్చు, చీకటి చోట ముళ్ల – పిచ్చి చెట్లు కంపలు కావచ్చు, ఎంగిలాకుల కంపులే కావచ్చు - అన్నిటినీ చక్కదిద్దడమే వాళ్ల అలవాటు! మరి - ఆ అలవాటేమన్నా ఒక నాటిదా? పుష్కర కాలపు వ్యసనం!

               రోడ్ల జంక్షన్ కనుక - మలుపులో పెద్ద చెట్లుంటే వాహన ప్రమాదాలకాస్కారం ఉంటుందని ఐదుగురు గట్టి కార్యకర్తలు కత్తులు - గొడ్డళ్లు పట్టి, జంగిల్ క్లియరెన్స్ కు పాల్పడ్డారు.

               మరో 5 గురు ఎప్పటి ఎండు కొమ్మలోగాని బాట పొందికను చెడగొట్టుతుంటే ట్రాక్టర్ లో కెత్తుకొని, అవసరమైన పల్లం చోటుకు తరలించారు!

               జంక్షన్ కు తూర్పు-దక్షిణాన, ఏ కోళ్ల దానా వ్యర్ధాలోగాని, లీలగా దుర్వాసన కొట్టుతున్న చోట మరో 5 గురు చదును చేసి, ఊడ్చారు!

               గడ్డికోత యంత్ర నిపుణుడైతే బాట ప్రక్కల ఎండు పచ్చి గడ్డిని తరిగేస్తున్నాడు! రమేష్ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ ఉద్యోగినీ, చోడవరం గ్రామ నివాసినీ తూము పూజిత మరికొందరు మహిళలతోబాటు నాల్గు వీధుల్ని ఊడుస్తున్నారు!

               తెల్లవారి, కాస్త చలి తగ్గాక స్వచ్చోద్యమ మిత్రుడైన ఉడత్తు రామారావు గారి ఆత్మసంతృప్తిదాయకంగా వారి కుమారులు కార్యకర్తలకు పంపిన బిస్కటుల పంపకం జరిగింది.

               రేపటి వేకువ కూడ మనం ఆగేదీ పని కొనసాగించేదీ సాగర్ ఆక్వా ఫీడ్సు వద్ద నుండే!

         ఎంత నిబద్ధత లేనిదె

అడుగో పల్నాటి భాస్కరామాత్యుడు చూస్తిరా?

భార్యా సమేతముగ ఆతని స్వచ్ఛసేవ చూస్తిరా!

ఆతడు తరచుగ చేసే దాతృత గమనిస్తిరా!

ఎంత నిబద్ధత లేనిదె ఈ సేవలు చేస్తురా!

- నల్లూరి రామారావు

ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

26.01.2026