పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3726* వ పర్యాయం కూడా శివరాంపురం రోడ్డులోనే!
ఆగి, రహదారి పారిశుద్ధ్యం మొదలెట్టింది 16 గురే! గబగబా వచ్చి కలిసి, బాట అంచుల - డ్రైనుల అస్తవ్యస్తతలను సరిద్దింది మరొక 13 మందే! 29 మంది పట్టుదలతో – 2 గంటల కఠిన శ్రమతో అందంగా మారినది సాగర్ ఆక్వా కర్మాగారం నుండి మేకలడొంక దిశగా మరొక 120 గజాల బాటే!
6.30 కు తొలగిన ప్లాస్టిక్ వ్యర్ధాలనూ, కలిగిన హరిత - శుభ్ర బాట దృశ్యాలనూ చూసుకొని మురిసినది స్వచ్చ కర్మిష్టుల మనస్సులే! పుష్కర కాలపు నాలుగైదు లక్షల పని గంటల సామాజిక శ్రమ సంస్కృతిని చూస్తూ కూడా ఇంకా పూర్తిగా కరగనివి సగం మంది గ్రామీణుల హృదయాలే!
అసలు ఊరికి దూరంగా – మరొకమారు భారీగా మంచు క్రమ్మిన వేకువ 4.20 నుండి ఈ 2 గంటల మొత్తంగా 40 కి పైగా పని గంటల శ్రమ దేనికి సంకేతం? కార్యకర్తలు సాధిస్తున్నదే పరమార్థం?
“ఈ మహిళలూ, ఆ వృద్ధులూ దశాబ్దానికి పైగా 9 బాటల్ని ఊడ్చి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్కులు ఏరి, ఏరోజుకారోజు సకల వ్యర్ధాల్నీ ట్రాక్టర్ల కొద్దీ రీసైకిలింగూ, ఎరువులుగా మార్చి, పచ్చందనాల్ని పెంచి, పర్యావరణాన్ని మెరుగుపరచి, ఎందుకింత కష్టించాలి? ఇళ్లలో హాయిగా పడుకోలేకనా? తమ డబ్బునూ, శారీరక - మేధో శ్రమనూ ఇంతగా ఖర్చుపెట్టాలా?...” వంటి ప్రశ్నలు గ్రామస్తులు ఎవరికి వారు వేసుకోవద్దా?
నేనిది వ్రాస్తున్న 6.20 సమయానికి అదుగో – చెత్త లోడింగు పూర్తయింది, నిన్న జిల్లా కలెక్టరు గారి నుండి తన సామాజిక సేవలకు గాను అవార్డు పొందిన 86 ఏళ్ల వృద్ధ కార్యకర్త ఇప్పుడే చీపురును వదిలేశారు.
అందరొకచోట చేరి డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారిని అనుసరిస్తూ శ్రమదానోద్యమ నినాదాలను ప్రకటిస్తున్నారు.
రేపటి వేకువ శ్రమ సంరంభం కూడ ఈ మేకలడొంక ప్రాంతంలోనే అని తీర్మానించుకొన్నారు!
చల్లపల్లి కస్తూర్భా ఆసుపత్రిలో డాక్టరు గా పనిచేసి విజయవాడ లో స్థిరపడిన డా. మల్లెల వెంకట రత్న కుమారి గారు ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ఉద్యమ విశేషాలను తెలుసుకుని స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం ‘మనకోసం మనం’ ట్రస్టుకు 20 వేల రూపాయల చెక్కును మేనేజింగ్ ట్రస్టీ గారికి అందజేశారు.
సమాజానికి ప్రీతికరమా?-2
పట్టుదలతో కార్యకర్తలు పదీ – పదకొండేళ్ల నుండీ
ఊరి వీధుల, వీధి ప్రక్కల ఉన్న మురికిని కడుగు తుంటే
పట్టనట్లో – చూడనట్లో ప్రజలు విజ్ఞులు మిన్నకుంటే
సహేతుకమా? సమున్నతమా? సమాజానికి ప్రీతికరమా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
27.01.2026