3727* వ రోజు .......           28-Jan-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

3727* వ శ్రమోల్లాసం ఇలా ఉండెను!

               బుధవారం (28-1-26) నాటి ఆ ఉత్సాహం 37 మందిది; వారి ఉత్సాహానికి కారణం మేకలడొంక వంతెనకు 3 ప్రక్కలా - 200 గజాల మేర శివరామపురం రహదారిని తమకు నచ్చినట్లుగా సంస్కరించగలగడమే; రానున్న పెదకళ్లేపల్లి శివరాత్రి తిరునాళ్లకు వేలాది భక్తుల ప్రయాణ మార్గాన్ని హరిత - శుభ్ర - సుందరంగా మారుస్తున్న సంతృప్తే!

               గతంలో కొన్నేళ్ళు 3-4 ఊళ్ళ కార్యకర్తలు ప్రతి శివరాత్రికి ఈ రహదారి శుభ్రతనొక పవిత్ర యజ్ఞంలా నిర్వహించేవారు; కేవలం శివరామపురీయులే 15 మంది పాల్గొనేవారు; ఆ గ్రామ ప్రతినిధి ఈపూట కేవలం ఒక్క ప్రేమానందులవారే! ఇప్పుడు కూడ 4 గ్రామాల (రామానగరం, చల్లపల్లి, శివరాం, వెంకటాపురాల) వాళ్లు ఆ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారనుకోండి!

               ఇక ఈ వేకువ రహదారి సుందరీకరణ సంగతికొస్తే - ఓ! దానికేం - భేషుగ్గా జరిగింది? ఎందుకు జరగదు? స్వయంగా సర్పంచి దంపతులూ, ఈ ప్రాంతపు స్వచ్ఛోద్యమ సారథీ, ఆస్పత్రి నర్సులూ, రైతులూ, విరమిత ఉద్యోగ వయోవృద్దులూ, వణిక్ప్రముఖులూ, మరీ ముఖ్యంగా వెంకటాపుర పాఠశాల నుండి నలుగురూ వచ్చి, కాలుష్యాల మీద కక్షగడితే - 2 గంటలు ప్రయత్నిస్తే – ఎక్కడెక్కడి ప్లాస్టిక్ భూతాలూ, రాదారి మార్జిన్ల నానా వ్యర్ధాలూ, తొలగిపోవా?

               కాలుష్యాల విషయంలో ఈ బాటకు తండ్రి - తాత - ముత్తాతల్లాంటి 1 వ వార్డు వీధీ, గంగులవారిపాలెం బాటా, పాగోలు రోడ్డూ బాగుపడలేదూ? ఆ ముందు చూపో - ఘనతో పుణ్యమో ఈ స్వచ్ఛ కార్యకర్తలది కాదూ?

               సోమవారం నాటి తుది సభ షణ్ముఖ శ్రీనివాసుని, నేటి సభ మేకలడొంకలో వేముల శ్రీనివాసునీ నినాదాలతో ప్రారంభమై,

               రేపటి శ్రమదానం సైతం ఇదే మేకలడొంక వంతెన నుండే మొదలు కావలెననే నిశ్చయంతో ముగిసింది!

            సమంజసమా? సహేతుకమా?-3

స్వచ్చ సుందర కార్యకర్తలు పావులక్ష ప్రజాహితానికి-

స్వచ్చ శుభ్రత వికాసానికి – సంతసానికి-వినోదానికి

క్రమిస్తున్నా- శ్రమిస్తున్నా గ్రామ విజ్ఞులు మిన్నకుండుట

సమాజానికి ప్రీతికరమా? సమంజసమా? సహేతుకమా?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    28.01.2026