3728* వ రోజు ..........           29-Jan-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

3728* వ పూట 30+ ముగ్గురి సామాజిక శ్రమ సౌందర్యం?

               పాతిక మందిది చల్లపల్లి, 5 గురిది రామానగరం, ముగ్గురు శివరామ, వెంకటాపుర కార్యకర్తలు! వాళ్ల సమైక్య - సమ్మానవీయ శ్రమదానస్థలి అదుగో - కళ్లేపల్లి రహదారిలోని మేకలడొంక వంతెన కటూ - ఇటూ సుమారు 200 గజాలు! కాలగణనం వేకువ 4.20 నుండే 6:20 దాకా సుమారు 50 పనిగంటలు!

               ఆ 2 గంటలపాటు బాగా దగ్గరగా పరిశీలిస్తే - ఉచ్చకంపు మడుగుల ప్రక్కన, డ్రైన్ల అంచున, రహదారి బారునా కార్యకర్తల శ్రమ కనిపిస్తుంది గాని - వాళ్ళ పట్టుదల తెలుస్తుంది గాని - శుభ్రపడిన రహదారి భాగం కొలువగలరు గాని - శ్రమజీవన సౌందర్యం మాత్రం నిండు మనసుతోనే అనుభవైక వేద్యం!

               ఎన్నెన్ని ఏకమాత్ర ప్రయోజనకర ప్లాస్టిక్ వస్తువులేరారోఎంత చెత్తనూ, ఎండుటాకుల్నీ ప్రోగులు చేసి, ట్రాక్టరుకెత్తారో, పని సమయంలో ఎవరికెవరు ఎంతగా సహకరించుకొన్నారో, చెప్పగలను కాని -

               ఈ మొండి ఘటాలు 12 ఏళ్లుగా తమ ఆదర్శ శ్రమదానం ద్వారా ప్రజలకు పంచుతున్న గొప్ప సందేశాన్ని పూర్తిగా చెప్పగలనా?

               చెత్త పనుల్లో వాళ్లు పొందుతున్న సంతృప్తిని కొలువగలమా?

               వాళ్ల లక్ష్యాలు :

1)         చల్లపల్లి, దాని పరిసరాల పరిశుభ్రతా నిర్వహణం,

2)         వేలాది మొక్కలు పెంచి, ప్రజలకాహ్లాదాన్నీ, పర్యావరణానికి వెసులు బాటునూ కల్పించడం,

3)         తమ నిత్య శ్రమ సంతర్పణ ద్వారా ప్రజల్లో సామాజిక స్పృహను పెంచడం వగైరాలు!

               ఇప్పటికిప్పటి లక్ష్యమైతే - శివరాత్రి పండుగ నాటికి ఈ 3-4 కిలోమీటర్ల రహదారిని భక్తజనాహ్లాదమయం చేయడమే!

               ఈనాటి తుది సమావేశం కస్తూరి శ్రీను నినాదాలతో మొదలై, “Dr. DRK గారి - నిన్నటి కళాశాల విద్యార్థుల రహదారి శుభ్రతల, నేటి స్వచ్చ కార్యకర్తల ప్రయాత్నాల సుదీర్ఘ సమీక్షతో ముగిసింది.

               రేపటి శ్రమదాన కూడ పంట కాల్వ, మేకలడొంకల నడుమనే!

               స్వస్తతలను సాధిస్తూ...

కసవులూడ్చి, మురుగు తోడి, కాలుష్యము నరికట్టి,

చెట్లను విరివిగ పెంచి, చల్లదనం రక్షింస్తూ

జనాహ్లాదమును పెంచే - స్వస్తతలను సాధిస్తూ

ఊరిని రక్షించు విధము వారికి బాగుగ తెలిసెను.

- నల్లూరి రామారావు

     ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

     29.01.2026