పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
మళ్లీ శివరాంపురం బాటకే 27 గురి కష్టం సమర్పితం - @3729*
వందల మంది బాటసారుల ఆహ్లాద నిమిత్తం ఈ స్త్రీల-పెద్దల-రైతుల-వ్యాపారుల-ఉద్యోగుల - 4.20 - 6.18 నడమి కష్టాలతో- మేకలడొంక – గ్రామ సమీప పంటకాల్వల మధ్య రహదారి భాగం ఎంతగా శుభ్రపడిందో - శంకర శాస్త్రీయ, బృందావనీయ, తూము వెంకటేశ్వరీయ దృశ్య శ్రవణ చిత్రాలను చూసినా తెలుస్తుంది.
బాటకు తూర్పున అడ్డదిడ్డంగా పడున్న పొడవైన తాళవృక్ష ఖాండాలను పొందికగా సర్దిన 5 గురు బలిష్ట కార్యకర్తల కఠిన శ్రమనూ,
200 గజాల రోడ్డునూ, మార్జిన్లనూ గూళ్లరిగేంతగా ఊడ్చిన మహిళా కార్యకర్తల పట్టుదలనూ,
3 గోనె సంచుల నిండుగా 2 రకాల సీసాలను, గ్లాసులను ఏరి,
విభజించిన ఒక షణ్ముఖ వ్యాపారి ప్రయత్నాన్ని,
అక్కడి ఎండు కొమ్మల్ని, పుల్లల్ని, వరి చెత్తనూ, ఆకుల్ని, మట్టల్నీ లాగి, ప్రోగులు చేసి, ట్రాక్టర్ లో నింపిన 10 మంది పనినీ....,
“నేను చూశాను, నేను గుర్తించాను, సహానుభూతి పొందాను...!”
6.20 పిదప, తూము వారి భీకర ఈల శబ్దం విని కూడ పని మానని 5 గుర్ని గూర్చి ఆలోచించాను! “అసలిది సమాజ సేవా? స్వచ్ఛ - శుభ్ర -సౌందర్య వ్యసనమా?” అని ప్రశ్నించుకొన్నాను!
6.45 కు జరిగిన సమీక్షా సభను 8 రోజుల గ్యాప్ తరవాత – తీర్ధయాత్రలు ముగించి వచ్చిన అంబటి శంకర కార్యకర్త నినాదాలతో ప్రారంభించగా....
“ఆహా! ఈ శుభ్రపడిన 200 గజాల రహదారి ఎంత అందంగా ఉన్నది, అసలీ చెత్త పనులీ కాలంలో ఎవరు చేస్తారండీ...” అని తరచుగా అనే మన స్వచ్ఛ సీనియర్ వైద్యుని మాటలను కార్యకర్తలకు గుర్తు చేశాను!
తన ఇంటి పెరటి సొరకాయల్ని శివరామపురస్థ రైతుపెద్ద ప్రేమానందుల వారు పంచడం గమనించాను!
కార్యకర్తల్ని సంప్రదించి, రేపటి వేకువ ఈ పెదకళ్ళేపల్లి బాటలోనే “మన శ్రమదానం” అని ఇందుమూలంగా ప్రకటిస్తున్నాను!
సమాజ భవితకు హానికరమా?-4
ఐదు లక్షల గంటలుగ ఈ స్వచ్చ సుందర కార్యకర్తలు
ఊరి మేలుకు చెట్లు పెంచుచు ఉధృతంగా పాటుబడగా...
తస్కరించే, నరికి వేసే దుండగీడుల నుపేక్షించుట
సమంజసమా? సహేతుకమా? సమాజభవితకు హానికరమా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
30.01.2026