పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
గ్రామ పరిసర సుందరీకరణ క్రీడలో 3731* వ నాటి విశేషాలు..
ఆదివారం (ఫిబ్రవరి తొలిదినం) వేకువ 4.20 కే సదరు పర్యావరణ ప్రయోజనకర క్రీడను 16 గురు ప్రారంభించారు; రెండవ, మూడవ బ్యాచ్ ల ఆటగాళ్లూ, ఆటగత్తెలూ కాస్త వెనకా ముందుగా 2-3 కిలో మీటర్లు ప్రయాణించి ఆటస్థలం (శివరాంపురం పంట కాల్వ దగ్గర)లో కాలు మోపారు!
2 మండలాల - 4 గ్రామాల –( చల్లపల్లి, మోపిదేవి మండలాలు-శివరాం, వెంకటాపుర, చల్లపల్లి రామానగర) మొత్తం 51 మంది క్రీడ లెలా సాగిందీ, విజేతలెవరనేదీ ఆలోచిస్తే:
ఈ అర్థ శత క్రీడాకారులొకవైపూ, పెదకళ్లేపల్లి మార్గంలోని 250 గజాల కాలుష్యాలొక వైపుగా సాగిన క్రీడా సమరంలో-
అంతిమ విజేతలు స్వచ్ఛ కార్యకర్తలే! బాటకు తూర్పున కొందరు రైతుల అభ్యర్థన వల్ల కొంత మేర స్వచ్చ క్రీడ సాగనందు వలన ఈ ఆటగాళ్ల గెలుపు సులభమైంది.
రహదారి ఊడ్పులు, ప్లాస్టిక్ వ్యర్థాల ఏరుడు, బోగన్ విలియా వంటి ముళ్ల పూల కొమ్మల కత్తిరింపులు, పిచ్చి మొక్కల పని పట్టుడు, గడ్డి చెక్కుడు వంటి పనుల వేళనే ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తి తెలిసొచ్చింది.
కత్తుల వాడకం, దంతెల ఉపయోగం, మర రంపంతో తాడిచెట్ల ఖండనం, వ్యర్థాలను ప్రోగులు పెట్టడం అయ్యాక – ఒకటి కాదు-2 ట్రాక్టర్ల వ్యర్థాల్ని విభజించి, వాటి గమ్యాలకు చేర్చడం వంటి పనులన్నీ యధాతథంగా ముగిశాక...
11 మంది వెంకటాపురం దిన సరి కూలీలూ + విద్యార్థులూ, ఇద్దరు శివరామ పుర ప్రముఖులూ, ఆరేడు గురు రామానగర నివాసులూ, తక్కిన చల్లపల్లికి చెందిన శ్రామికులు- అర్థవలయ సుందరంగా నిలిచి, సఙ్ఞా ప్రసాదు గారి నినాదాలకు బదులు పలికి, Dr. DRK గారి మనసా- వాచా ప్రశంసలు విని, పలనాటి వారి పిండి వంటలు స్వీకరించి,
రేపటి వేకువ మరల ఇదే. P.K.పల్లి రహదారి కాలుష్యాల పని పట్టాలని నిర్ణయించి, 7.00 కు నేటి కార్యక్రమం ముగించారు!
సర్వసుజనా మోదకరమా?-6
మురుగు కాల్వల-పెంట కుప్పల ముక్కులదిరే చెడ్డ వాసన
లేని వీధుల కొరకు వేకువ లేచి ఇందరు శ్రమిస్తుంటే
తెలిసి కూడా తెలియనట్లే తెలివిగానే మిన్నకుండుట
సర్వసుజనా మోదకరమా? సహేతుకమా?సమంజసమా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
01.02.2026