3736* వ రోజు .........           06-Feb-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

శివరామపురం శ్రమదానం వద్ద 9+22+3 మంది!-@3736*

               ఈ సమాచారం 6.2.26 శుక్రవారం నాటిది; అందులో తొలి 9 సంఖ్య దట్టమైన మంచులో మరీ 4.18 కే రహదారి శుభ్రతకు సంసిద్ధులు, రెండో - మూడో కిలోమీటర్లు నెమ్మదిగా పయనించి, 3 గ్రామాల నుండి చేరుకొన్నది 22 మంది; చివరి ముగ్గురు అతిథులు!

               నేటి అసలైన వింత - వెంకటాపుర, చల్లపల్లి, రామానగర స్వచ్చ కార్యకర్తలిందరు తమ ఊరి వీధి స్వచ్చ – సౌందర్యాలకై 2 గంటలు శ్రమిస్తుంటే - శివరాంపుర నివాసుల్లో ఒకే ఒక్క ప్రేమానందులు తప్పు ఎవ్వరూ పట్టించుకొనకపోవడమే! అందుక్కారణం శ్రమోద్యమకారులదా - ఈ గ్రామస్తులదా అనేది అసలైన ప్రశ్న!

               మల్లంపాటి వారి ఇంటినుండి ఈ పూట శ్రమదానం వెంకటాపురం దిశగా 100 గజాలకు పైగా పురోగమించింది. “32 మంది శ్రామికులు 2 గంటల పాటు సాధించినది ఈ మాత్రమేనా?” అంటే – అందుకూ కారణాలున్నాయి!

-కార్యకర్తల్లో కొందరు ఊరికి దూరంగా ఉన్న పంటకాల్వకు దక్షిణ-పశ్చిమ గట్టును శుభ్రపరచడానికి వెళ్లడమూ, అచ్చటి వ్యర్ధాలను సేకరించుకొని రావడమూ ఒక కారణం.

- గ్రామం దక్షిణాన - మల్లంపాటి వారి ఇంటి సమీపాన ఎదుటి వీధి వాళ్లు డంపును నిర్వహిస్తుండడమూ, అక్కడ 25 గజాల డ్రైనూ మార్జినూ దట్టమైన పిచ్చి మొక్కల, ముళ్ల మొక్కల – వాటి నడుమ నానా వ్యర్ధాల చిట్టడవిగా తయారవడం మరో కారణం.

శుభ్ర-సుందరీకర్తల శ్రమ విషయానికొస్తే :

- గడ్డి తొలగింపు యంత్రపు నియంత గంటన్నరకు పైగా ప్రధానంగా బాట తూర్పు దిశలో మరరపాన్ని ఆడిస్తూనే ఉండెను;

- 20 మంది కత్తుల వారు కాలుష్య ధ్వంసాన్ని, రహదారి పొందికనూ సాధిస్తూనే ఉండిరి;

               ఊడ్పులూ, దంతె పనులూ, వాటికి సమాంతరంగా చెత్తలోడింగులూ, ఈ సామాజిక బాధ్యతల ఛాయాచిత్ర గ్రహణాలూ... అన్నీ సక్రమంగానే జరిగెను. DRK గారి పని పర్యవేక్షణలూ, శ్రమ సౌందర్య వీక్షణానందమూ షరామామూలు గానే! ఆయన సమీక్షలో షణ్ముఖ శ్రీనివాసు రోగుల, వృద్ధుల సహకార సౌజన్యం కొరకు క్రొత్త వాహనం కొన్న విషయం ప్రస్తావనకొచ్చెను!

               86 ఏళ్ల పరుచూరి వసుమతి గారి మరణానంతర శరీరావయవదానం ఆలోచించగలవారందరికీ ప్రేరణ!

               రేపటి శ్రమదానం కూడ శివరామపురం నుండి వెంకటాపురం వైపే!

               స్వచ్చోద్యమ అనుభూతులు!

సాహసాలు కొన్ని మార్లు - సంయమనము కొన్ని చోట్ల

సంచలనములప్పుడపుడు – సాఫీ పనులచ్చటచట

ఐకమత్యమన్నియెడల - ఆనందములన్నిటిలో

-అవే మా దశ వసంత స్వచ్చోద్యమ అనుభూతులు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   06.02.2026