3737* వ రోజు .........           07-Feb-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

3737* వ నాటి 41 మంది రహదారి బాధ్యతలు!

               ఆ రహదారి చల్లపల్లి ఊరిది కాదు-శివరామ-వెంకటాపురాలది; చల్లపల్లి-రామానగరాలకు 3-4 కిలోమీటర్ల దూరానిది. కాకపోతే వారాంతం కనుక ఈ శనివారం (7-2-26) ఇంకా ఎక్కువ మందే కార్యకర్తలు రావలసినది.

               మరి వెంకటాపురం, శివరాంపురం నుండి ఒక్కొక్కరు ఈ రహదారి సేవలెందుకు? ఇంత మంచులో చలినెదిరిస్తూ వేకువ 4.18-6.22 మధ్య ఇందరి దుమ్ము-మురికి పనులెందుకు?

               అందుకొక కారణం ఈ కార్యకర్తలు ఆవారాగాళ్లు కాదు-ఉద్యోగులూ, విశ్రాంత ఉద్యోగులూ, ప్రొఫెషనర్లూ కావడంవల్ల ఉదయం 8:00 దాటితే వాళ్లకు సమయం దొరకదు. అందుకని తమ రోజులోని తొలి బ్రహ్మముహూర్తంలో గత 12 ఏళ్లుగా తమ సామాజిక బాధ్యతల్ని నెరవేరుస్తున్నట్లే-ఈ వేకువ కూడ శివరామపురం దక్షిణంగా

1. సగం కాలి, అసహ్యంగా కనిపించే చెట్ల కొమ్మల ఖండనమూ, రోడ్డు మీదికి పెరిగి, వరిగడ్డి బళ్లకు ఇబ్బందిగా మారిన కొమ్మల తొలగింపూ, తద్ద్వారా రహదారి అలంకరణమూ చేశారు. కొందరు కాస్త సహకరించినా, ప్రధానంగా ముగ్గురుప్రసాదుల పనే ఇది

2. డ్రైను కడ్డంగా ఉన్న తుక్కునూ, పిచ్చిమొక్కల్నీ, ఎండుకొమ్మల్నీ, ఆకుల్నీ ఆ చీకటిలో ఊడ్చి, దంతెలతో లాగడమెంత కష్టమో ఆ 10  మంది కార్యకర్తల చెమట ముఖాల్ని చూస్తే తెలుస్తుంది.

3. ఎత్తుపల్లాల-కాలు సరిగా నిలవని చోట్ల-పాతిక మంది పీకిన, చెక్కిన గడ్డినీ, ఇతర వ్యర్ధాల్నీ నలుగురు ప్రోగులు చేస్తుండగా, ఏడెనిమిది మంది డిప్పల్తో మోసి, ట్రాక్టర్ లో నింపుతున్న సందర్భమే-ఆ 25 నిముషాల శ్రామిక సౌందర్యమే ఎవరినైనా ఆకర్షించేది!

4. అసలెందుకిందరు స్త్రీ బాల-వృద్ధ-సామాజిక సేవకులు ఈ వెంకటాపురం రోడ్డును ఇంతగా ఊడ్చి, చెట్లు పెంచి, పూలు పూయించి, పండ్ల చెట్లు వృద్ధి చేసి, బట్టలకు దుమ్మంటుకొనే పనులు చేస్తారో-అందుకు ఆనందిస్తారో-12 ఏళ్లుగా చూస్తున్న నా వంటి వాళ్ళకే అశ్చర్యం కలుగుతుంది.

               ఎప్పటిలాగే దైనందిన తుది సమీక్షా సమావేశంలో:

-DRK వైద్యుడు పట్టరాని సంతోషంతో ఈ సామూహిక సామాజిక సేవలను ప్రస్తుతించి,

- వేముల షణ్ముఖ శ్రీనివాసు త్రిచక్రవాహన ప్రజాసేవను కార్యకర్తలంతా మెచ్చి,

- ఆతడు ముమ్మారు ప్రకటించిన సేవా నినాద ప్రతిజ్ఞలు పునరుద్ఘాటించి, (ఈ ప్రతిజ్ఞలు నిన్న చేయించినది పోస్టల్-మెండు శ్రీను),

- స్వల్ప అస్వస్తత వలన కొన్నాళ్ళు రాలేకపోయిన డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు ఈ పూట మాత్రం మంచుని, చలినీ త్రోసిరాజని శివరాంపురం పని ప్రాంతానికి వచ్చి స్వయంగా తన 2000/-   నెలవారీ చందాను చెల్లించినందుకు ధన్యవాదములు.   

               రేపటి రహదారి సుందరీకరణ కూడ ఈ పెదకళ్లేపల్లి బాటలోనని నిర్ణయించారు!

               సాహసం నెమరేసుకోరా?

భగత్ సింగ్ ఆస్పత్రి ప్రాంతపు బాహ్యసర్జన గుర్తులేదా?

గతంలో మన గ్రామ వీధుల కల్మషాలను మరచినారా?

గంగులపాలెం బాట నరకపు సంగతిని విస్మరించారా?

స్వచ్ఛ సుందర కార్యకర్తల సాహసం నెమరేసుకోరా?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   07.02.2026

- స్వల్ప అస్వస్తత వలన కొన్నాళ్ళు రాలేకపోయిన డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు ఈ పూట మాత్రం మంచుని, చలినీ త్రోసిరాజని శివరాంపురం పని ప్రాంతానికి వచ్చి స్వయంగా తన 2000/- నెలవారీ చందాను చెల్లించినందుకు ధన్యవాదములు.