3741* వ రోజు .........           11-Feb-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

 

30 మంది సేవలతో మురిసిన ప్రాత శివరాంపురం బాట - @3741*

 
అనగా-ఆ బాధ్యతలు బుధవారం (11-2-26) నాటివి! వీరిలో నలుగురైదుగురు ట్రస్టు ఉద్యోగులు తప్ప-ఎవరికీ ఏమాత్రం ఆర్ధిక ప్రయోజనం లేనివి!
 
“అదీ ఒక ప్రయోజనమా? అంతకన్న విలువైన ఆత్మ సంతృప్తి కదా మేం పొందుతున్నది?” అని కొందరూ, ప్రతి వేకువా ఈ 2 గంటల శారీరక శ్రమా, 30-40 మంది సజ్జన సాంగత్యమూ లేకపోతే మా ఆరోగ్యాలేం కాను?” అని అందరూ భావిస్తున్న గ్రామసేవలనబడే సామాజిక బాధ్యతలవి!
 
ఇలాంటి గొప్ప తాత్త్వికచింతనలే లేకుంటే-ఈ 12 ఏళ్ల శ్రమదాన అద్భుతం సంభవించేదా? అన్ని ఊళ్లలాగే మురికి ఓడుతూ ఉండే చల్లపల్లి ఇప్పుడు స్పచ్ఛ-సుందర-హరిత-ఆహ్లాద చల్లపల్లిగా మారేదా? రాష్ట్ర రాష్ట్రేతర 40 గ్రామాల వారికి స్ఫూర్తిమంతంగా నిలిచేదా? చల్లపల్లేనా? దాని చుట్టూ ఏడెనిమిది రహదారులు ఇంత హరిత పుష్ప సౌజన్యం సాధించేవా?
 
ఈ వేకువ ఇందరు కార్యకర్తలు మేల్కొన్నది 3.30 ప్రాంతంలో; 3-4 కిలోమీటర్లు గడిచి, నాలుగూళ్ళ నుండి వచ్చి ఆగింది శివరాంపురం సమీప కోళ్లఫారం వద్ద; కత్తులతో, గొర్రులతో, పలుగు పారలతో శుభ్ర-సుందరీకరించింది 100 గజాలకు పైగా రహదారిని;
 
లోడు చేసి, శివరామపురం చెత్త కేంద్రానికి తరలించినవి పెద్ద ట్రాక్టరు నిండుగా రకరకాల వ్యర్థాలు; కొన్ని తాటాకుల, కొమ్మల వంటి వ్యర్ధాలను కంచెగా ఏర్పరచింది మినపచేలకు; ఏరిన గాజు ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు 2 గోనె సంచులకు సరిపడా;
 
6.40 వేళ Dr. DRK అభినందనపూర్వకంగా సమీక్షించినది నేటి మొత్తం 50 పని గంటల శ్రమను; కొంచెం తడబడుతూ మేడా బెనర్జీ చెప్పిన నినాదాలను అనుసరించింది కార్యకర్తలందరూ; ఏ గ్రామస్తులైనా విధిగా-ఎప్పటికైనా నడవదగింది ఈ చల్లపల్లి స్పచ్ఛ-సుందరోద్యమం అడుగుజాడల్లో!
 
అందరూ రేపు కలవదగినదిగా నిర్ణయించినది-మళ్ళీ ప్రాత శివరామపురం దగ్గరి కోళ్లఫారం వద్ద!
 
               ఏదసాధ్యం? ఏదనర్హం?
 
కలుషితాలను వెదకుకొంటూ గ్రామగ్రామం తిరిగినారట!
పంట కాల్వల మరామత్తుల వంటివీ సాగించినారట!
వీధి ఊడ్పులు బ్రహ్మకాలము విడవకుండా చేసినోళ్లకు
వీధి మురుగులు తోడినోళ్లకు ఏదసాధ్యం? ఏదనర్హం?
 
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
11.02.2026